Venkateswarlu
Venkateswarlu
సీమెన్స్ స్కాం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. జైలు అధికారులు ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించారు. ఇంటినుంచి ప్రత్యేకంగా భోజనం తెప్పించుకునే అవకాశం సైతం కల్పించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ చంద్రబాబును ఉంచారు. అయితే, జైలులో ఆయనకు రక్షణ లేదంటూ.. హౌస్ రిమాండ్ కోసం సిద్ధార్థ్ లూథ్రా ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై సుధీర్ఘ విచారణ చేసిన ఏసీబీ కోర్టు ఇరు పక్షాల వాదనలు వింది. సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలు సరైనవి కావటంతో.. ఏసీబీ కోర్టు వారితో ఏకీభవించింది. ఈ మేరకు మంగళవారం తుది తీర్పును ఇచ్చింది. చంద్రబాబును హౌస్ రిమాండ్‌కు ఇవ్వాలన్న పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా పెట్టిన ఓ ట్విటర్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ ఇన్ ది సర్వీస్ ఆప్ గురు గోవింద్ సింగ్ జీ ట్విటర్ ఖాతా పెట్టిన పోస్టును ఆయన రీ ట్వీట్ చేశారు.
దానికి ‘మోటో ఫర్ ది డే’ అని కామెంట్ కూడా పెట్టారు. ఆ పోస్టులో ఈ విధంగా ఉంది. ‘ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. న్యాయం కనుచూపు మేరలో కనిపించనపుడు.. కత్తి పట్టడానికి అదే సరైన సమయం. అదే యుద్ధం చేయడానికి సరైన సమయం’’ అని ఉంది. వైరల్‌గా మారిన ఈ పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉంటూ.. సుప్రీంకోర్టులో కీలక పదవిలో పని చేసిన లూథ్రా ఇలా న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇన్‌డైరెక్ట్‌గా అనుచిత కామెంట్లు చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. న్యాయంపై అన్యాయం ఎప్పటికీ గెలవదని అంటున్నారు. తప్పు జరిగిన చోట న్యాయం గురించిన ప్రస్తావన ఎక్కడుందంటూ లూథ్రాపై మండిపడుతున్నారు.
Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023