Rythu Runa Mafi: తెలంగాణ: గోల్డ్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌.. రూ.2 లక్షల వరకు

Rythu Runa Mafi-Gold Loans Waive: మీరు తెలంగాణలో గోల్డ్‌ లోన్‌ తీసుకున్నారా.. అయితే ప్రభుత్వం మీకో శుభవార్త చెప్పింది. అదేంటంటే..

Rythu Runa Mafi-Gold Loans Waive: మీరు తెలంగాణలో గోల్డ్‌ లోన్‌ తీసుకున్నారా.. అయితే ప్రభుత్వం మీకో శుభవార్త చెప్పింది. అదేంటంటే..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన దగ్గర నుంచి అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తోన్న హామీ రైతు రుణమాఫీ అమలుకు సర్వం సిద్ధమయ్యింది. మరో 24 గంటల్లో ఈ హామీ అమలు కానుంది.  ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే.. ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌ రెడ్డి.. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు. దీనికి కేబినెట్‌ ఆమోదం తెలపడమే కాక.. జూలై 18 అనగా గురువారం సాయంత్రం నాటికి లక్ష రూపాయల లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం.

రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రూ.లక్షలోపు లోన్‌ ఉన్న అన్నదాతల అకౌంట్లో గురువారం సాయంత్రంలోపు డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో రైతులంతా రేపటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రైతు రుణమాఫీకి సంబంధించి మరో కీలక అప్డేట్‌ తెలిసింది. బ్యాంకుల్లో బంగారం పెట్టి క్రాప్ లోన్ తీసుకున్నవాళ్లకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని.. అయితే పాస్ బుక్ ఉంటేనే బంగారంపై తీసుకున్న లోన్‌కి రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు.

అంతేకాక అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకపోయినా రుణ మాఫీ చేస్తామన్నారు. అయితే ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ఉన్నతాధికారులు, లక్ష రూపాయలు ఆపై జీతం తీసుకునే వారికి రుణమాఫీ ఉండదని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు బ్యాంకుల్లో 11.50 లక్షల మందికి రూ. లక్షవరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు. వీరి కోసం జూలై 18, గురువారం నాడు ఆరువేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామన్నారు.

తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తిస్తుంది అని మంత్రి తుమ్మల తెలిపారు. అయితే ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు వర్తించనుంది. 12 డిసెంబర్ 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన, లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09 డిసెంబర్ 2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు మాత్రమే ఈ మాఫీ వర్తిస్తుంది అని చెప్పుకొచ్చారు. 09 డిసెంబర్ 2023 నాటికి బకాయి వున్న అసలు, వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది.

Show comments