IMD Predicts Heavy Rains In TG On June 11th 2024: తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. ఆ 13 జిల్లాల్లో భారీ వర్షాలు

Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. ఆ 13 జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణకు వాతావరణ శాఖ కీలక అలర్ట్‌ జారీ చేసింది. నేడు, రేపు రెండు రోజులు తెలంగాణలో జోరు వర్షాలు కురుస్తాయని చెప్పడమే కాక కొన్ని జిల్లాలకు అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

తెలంగాణకు వాతావరణ శాఖ కీలక అలర్ట్‌ జారీ చేసింది. నేడు, రేపు రెండు రోజులు తెలంగాణలో జోరు వర్షాలు కురుస్తాయని చెప్పడమే కాక కొన్ని జిల్లాలకు అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

ఈ ఏడాది చాలా ముందుగానే రుతుపవనాలు దేశంలోకి విస్తరించాయి. ఇప్పటికే దక్షిణ భారతదేశం అంతటా జోరు వానలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు ఉపందుకున్నాయి. ఇక ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురుస్తాయిని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు కురవడంతో అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఇక బంగాళఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదారు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచన చేసింది. ఈ క్రమంలో నేడు తెలంగాణలో జోరు వానలు కురుస్తాయిని.. మరీ ముఖ్యంగా 13 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సూచించింది. ఆ వివరాలు..

జూన్‌ నెలారంభం నుంచే నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరిస్తున్నాయి. ఈనెల 5న రుతుపనాలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి తెలంగాణలోకి ప్రవేశించగా.. ప్రస్తుతం రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంతేకాక నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ఆ 13 జిల్లాలు ఏవంటే.. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక బుధవారం ( జూన్ 12) నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇక ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు తెలంగాణలో అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా తాండూరు, పెద్దేముల, దోమ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిల ప్రాంతంలో 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.

Show comments