Balagam Mogilaiah: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బలగం మొగిలయ్య.. ఆదుకోవాలని విజ్ఞప్తి

బలగం సినిమా ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బుడగజంగాల కళాకారుడు మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు. ఆ వివరాలు..

బలగం సినిమా ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బుడగజంగాల కళాకారుడు మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు. ఆ వివరాలు..

మొగిలయ్య.. బలగం సినిమా ముందు వరకు కూడా ఇతడి గురించి ఎవరికి తెలియదు. కానీ బలగం విడుదల తర్వాత.. సినిమా పేరు మొగిలయ్య ఇంటి పేరుగా మారింది. జబర్దస్త్‌ ఫేమ్‌ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సని పని లేదు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో వచ్చే పాట ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు ఈ పాటను ఎంతో ఆర్ధతతో పాడారు. ఆ ఒక్క పాట వీరి జీవితాలను మలుపు తిప్పింది అని చెప్పవచ్చు. ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో బలగం మొగిలయ్య మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరాడు. చికిత్సకు డబ్బులు లేవని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మొగిలయ్య భార్య విజ్ఞప్తి చేస్తుంది.

మొగిలయ్యకు కిడ్నీ, గుండె సంబంధింత వ్యాధులున్నాయి. దాంతో కొన్నిళ్ల క్రితమే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించడం కోసం వరంగల్‌లోని సంరక్ష అనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో మొగిలయ్య భార్య మాట్లాడుతూ.. చికిత్సకు తమ వద్ద డబ్బులు లేవని.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.

ఇక మొగిలయ్యకు కరోనా సమయంలో రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. అప్పటి నుంచి ఆయన డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో.. వారి ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది. కిడ్నీ సమస్యలతో పాటు గుండె, కంటి చూపు మందగించడం వంటి అనారోగ్య సమస్యలు కూడా మొగిలయ్యాను వెంటాడుతున్నాయి. ఇ​క గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, మెగాస్టార్‌ చిరంజీవి మొగిలయ్య చికిత్సకు సాయం చేశారు.

ఇప్పుడు మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. తమను ఆదుకోవాలంటూ మొగిలయ్య భార్య రేవంత్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొగిలయ్య స్వస్థలం వరంగల్‌ జిల్లా దుగ్గొండి గ్రామం. మొగిలయ్య దంపతులు ఊరూరా తిరుగుతూ.. కథలను గానం చేస్తూ.. పొట్ట పోసుకునే వారు. ఈక్రమంలో డైరెక్టర్‌ వేణు దృష్టిలో పడటంతో.. బలగం సినిమా క్లైమాక్స్‌లో వీరితో పాట పాడించారు.

Show comments