నగరవాసులకు శుభవార్త.. కేవలం ఒక్క రూపాయికే అంబులెన్స్‌ సేవలు!

అంబులెన్స్‌ అంటే ఆపదలో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడే సంజీవని లాంటిది అని చెప్పవచ్చు. రోడ్డు మీద ఎక్కడైన క్షతగాత్రులు కనిపించినా.. ప్రమాదాలు సంభవించినా మనకు వెంటనే గుర్తుకు వచ్చేది అంబులెన్స్‌. దీనికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి.. ప్రభుత్వం ప్రత్యేకంగా 108 ఉచిత అంబులెన్స్‌ సర్వీసులను ప్రవేశపెట్టింది. అలానే ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ కూడా అంబులెన్స్‌ సేవలు అందిస్తాయి. ఇందుకుగాను డబ్బులు తీసుకుంటాయి. అయితే ఈ మొత్తం భరించడం పేద, మధ్యతరగతి వారికి తలకు మించిన భారమే అని చెప్పవచ్చు. కొన్ని సార్లు ఈ అంబులెన్స్‌ ధరలను చెల్లించలేక.. మృతదేహాలను తీసుకుని కాలి నడకన, బైక్‌ల మీద వెళ్తోన్న హృదయవిదారక ఘటనలు అనేకం చూశాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని.. ఓ ఆస్పత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రూపాయికే అంబులెన్స్‌ సేవలు ప్రవేశపట్టింది. ఆ వివరాలు..

ఒక్క రూపాయి అంబులెన్స్‌ సేవలు కేవలం హైదరాబాద్‌ ప్రజలకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. పంజాగుట్టలోని మురుగన్ హాస్పిటల్‌.. ఈ ఒక్క రూపాయి అంబులెన్స్‌ సేవలను ప్రారంభించింది. 5 కిలోమీటర్ల పరిధిలో ఒక్క రూపాయికే అంబులెన్స్ సేవలను అందిస్తోంది. అంతేకాదు ఒక్క రూపాయికే కన్సల్టేషన్ సేవలను కూడా కేవలం ఒక్క రూపాయికే అందించి.. పేదల పాలిట పెన్నిదిగా నిలుస్తోంది. గురువారం ఈ ఆస్పత్రిలో ఆయుష్మాన్ భారత్ సేవలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క రూపాయికే అంబులెన్స్, డాక్టర్ కన్సల్టేషన్ సేవలు అందించడం మంచి విషయమని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆస్పత్రి ఎండీ ఏలూరి బాలచందర్ మాట్లాడుతూ.. పేద, మధ్యరగతి ప్రజల కోసమే ఒక్క రూపాయికే అంబులెన్స్, కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్ ప్రవేశపెట్టిన సేవలకు మంచి ఆదరణ లభిస్తుందని.. ప్రజలకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి అని తెలిపారు. కాగా హైదరాబాద్‌లో పలు ఆస్పత్రులు పేద, మధ్యతరగతి వారి కోసం ఇలాంటి తరహా సేవలను అందిస్తున్నాయి. వీటితో పాటు పలువురు వ్యక్తులు కూడా స్వచ్చంధంగా ముందుకొచ్చి ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తున్నారు.

Show comments