క్రికెట్ కెరీర్ కు ఒక్కొక్కరుగా వీడ్కోలు పలుకుతున్నారు ఆటగాళ్లు. గత కొన్ని రోజులుగా పలు దేశాలకు చెందిన ప్లేయర్స్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవలే ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ అలెక్స్ హేల్స్ తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో ఇంగ్లాండ్ ఆటగాడు తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ మెక్ గ్రాత్ గా పేరుగాంచిన ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు రిటైర్మెంట్ చెప్పడానికి బలమైన కారణం ఉంది.
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ తన ఇంటర్నేషనల్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. 2005 ఇంగ్లాండ్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ బౌలర్ సుదీర్ఘకాలం జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. తరచుగా గాయాలు వేధించడంతో.. వాటిని తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు వెళ్లడించాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో పాటుగా అదనపు బౌన్స్ ను రాబట్టడంలో అతడిని ఆసీస్ బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ తో పోల్చేవారు. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. ఫిన్ ఇంగ్లాండ్ తరఫున 36 టెస్టులు, 69 వన్డేలు, 21 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టులో125 వికెట్లు తీయగా.. వన్డేల్లో102 వికెట్లను నేలకూల్చాడు. కాగా.. 2012లో టీమిండియాపై 5 వికెట్లతో సత్తా చాటాడు.
ఇక తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ..”నేను గత సంవత్సర కాలంగా నా శరీరంతో పోరాడుతున్నాను. ఇక పోరాటం నా వల్ల కాదు. అందుకే నా ఓటమిని అంగీకరిస్తున్నాను. ఇంగ్లాండ్ టీమ్ కు ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా దేశం తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి మెుత్తం 125 మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించాను. ఇది నేను కలలు కన్నదానికంటే ఎక్కువ” అంటూ చెప్పుకొచ్చాడు స్టీవెన్ ఫిన్.
ఇదికూడా చదవండి: కోర్టు సంచలన తీర్పు.. విదేశాలకు వెళ్లకుండా ధోని సహచరుడిపై నిషేధం!