VIDEO: వరల్డ్‌ కప్‌ గెలిచిన కెప్టెన్నే అవమానించిన పాకిస్థాన్‌!

పాకిస్థాన్‌.. అస్థిరతకు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. గొప్ప గొప్ప విజయాలు సాధించినా.. కాంట్రవర్సీతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే జట్టు పాక్‌. టీమ్‌లోని ఆటగాళ్లే అనుకుంటే.. ఆ దేశపు క్రికెట్‌ బోర్డు కూడా అదే తరహా ధోరణిని అవలంభిస్తోంది. సాధారణంగా క్రికెట్‌ను అమితంగా ప్రేమించే ఇండియా, పాకిస్థాన్‌ లాంటి దేశాల్లో గొప్ప విజయాలు సాధించిన ఆటగాళ్లను నెత్తిన పెట్ట చూసుకుంటారు. అప్పుడెప్పుడో 1983లో భారత్‌కు తొలి వరల్డ్‌ కప్‌ అందించిన కపిల్‌ దేవ్‌ను ఇప్పటికీ ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌, బీసీసీఐ, ప్రస్తుతం ఉన్న క్రికెటర్లు ఎంతగానో గౌరవిస్తారు. ఇక 2011లో రెండో వరల్డ్‌ కప్‌ అందించిన ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కానీ, పాకిస్థాన్‌లో ఆ పరిస్థితి లేదు. వారికి 1992లో వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు దారుణంగా అవమానించింది. అందుకు పీసీబీ తాగాజా విడుదల చేసిన ఓ వీడియో వేదికైంది. మరో 50 రోజుల్లో భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్‌ కప్‌కు తమ టీమ్‌ను ఉత్తేజపరిచేందుకు.. తమ దేశ క్రికెట్‌ చరిత్రను, పాకిస్థాన్‌ టీమ్‌ సాధించిన విజయాలను ఉద్దేశిస్తూ.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఓ వీడియోను రూపొందించింది. ఆ వీడియోను తాజాగా సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేయగా.. అది కొద్ది నిమిషాల్లోనే వైరల్‌ అయి వివాదానికి వేదికైంది.

ఇంతకీ ఆ వీడియోలో తప్పు ఏంటంటే.. పాకిస్థాన్‌ జాతి పిత జిన్నా ఫొటోతో ప్రారంభమైన వీడియో.. పాకిస్థాన్‌లో క్రికెట్‌ పుట్టుక నుంచి.. వారు సాధించిన విజయాలు, గొప్ప గొప్ప ఆటగాళ్లు చేసిన అద్భుత ప్రదర్శనలు అందులో పొందుపర్చారు. కానీ, ఆశ్చర్యంగా 1992లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలిపించిన కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను మాత్రం అందులో చూపించలేదు. దీంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు, వసీం అక్రమ్‌ లాంటి మాజీ క్రికెటర్లు సైతం పాక్‌ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ, పాకిస్థాన్‌ క్రికెట్‌లో గొప్ప కెప్టెన్‌ నిలిచి, వరల్డ్‌కప్‌ అందించిన ఆటగాడిని ఇలా అవమానిస్తారా? అంటే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.

కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌.. రాజకీయాల్లోకి వచ్చి పాక్ ప్రధాని కూడా అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ల ప్రత్యర్థులు అధికారంలో ఉండటంతో.. ఈ వీడియోలో ఇమ్రాన్‌ ఖాన్‌ను ఉద్దేశపూర్వకంగానే చూపించలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో వీడియోను మళ్లీ ఎడిట్‌ చేసి.. ఇమ్రాన్‌ ఖాన్‌ వరల్డ్‌కప్‌ అందుకున్న క్లిప్స్‌ను యాడ్‌ చేసి కొత్త వీడియోను పోస్ట్‌ చేసింది పీసీబీ. అయితే ముందు వీడియోలో ఇమ్రాన్‌ ఖాన్‌ క్లిప్స్‌ మిస్‌ అవ్వడానికి పీసీబీ చెప్పిన కారణం కూడా హాస్యాస్పదంగా ఉంది. వీడియో నిడివి ఎక్కువగా ఉన్నే కారణంగా కొన్ని క్లిప్స్‌ మిస్‌ అయ్యాయని, ఇప్పుడు వాటిని జత చేసి పూర్తి వీడియోను రిలీజ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. చేసిన తప్పును ఒప్పుకోకుండా.. ఇలా కుంటి సాకులు చెబుతున్నారంటూ.. పాక్‌ క్రికెట్‌ బోర్డుపై ఇమ్రాన్‌ ఖాన్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏ జట్టునైనా ఓడిస్తాం! భారత్‌తో సిరీస్‌కి ముందు ఐర్లాండ్‌ క్రికెటర్‌ వార్నింగ్‌

Show comments