అక్తర్​కు బ్రెట్ లీ సవాల్.. తర్వాత ఆ రాక్షసుడు ఆస్ట్రేలియాను వణికించేశాడు!

Shoaib Akhtar-Brett Lee: అందర్నీ భయపెట్టే ఆస్ట్రేలియాను ఆ రాక్షసుడు వణికించాడు. బ్రెట్​లీ సవాల్​ను స్వీకరించి కంగారూలను ఓ ఆటాడుకున్నాడు. ఇది జరిగి 22 ఏళ్లు అవుతోంది.

Shoaib Akhtar-Brett Lee: అందర్నీ భయపెట్టే ఆస్ట్రేలియాను ఆ రాక్షసుడు వణికించాడు. బ్రెట్​లీ సవాల్​ను స్వీకరించి కంగారూలను ఓ ఆటాడుకున్నాడు. ఇది జరిగి 22 ఏళ్లు అవుతోంది.

క్రికెట్​లో వెస్టిండీస్ శకం ముగిశాక ఆస్ట్రేలియా హవా మొదలైంది. 1990వ దశకం చివరి నుంచి 2010 వరకు ఆ టీమ్ వరల్డ్ క్రికెట్​ను శాసించింది. కంగారూలు అంటే అందరూ భయపడుతున్న రోజులవి. ఆస్ట్రేలియా ప్లేయర్లను చూస్తేనే అవతలి జట్లు గడగడలాడేవి. జస్టిన్ లాంగర్, మాథ్యూ హేడెన్, రికీ పాంటింగ్, మార్క్ వా, స్టీవ్ వా, డామియన్ మార్టిన్, ఆడమ్ గిల్​క్రిస్ట్.. ఇలా ఒకర్ని మించిన ఒకరు అరివీర భయంకర బ్యాటర్లతో ఆ టీమ్ డేంజరస్​గా ఉండేది. వీళ్లకు తోడు బౌలింగ్ యూనిట్ కూడా అంతే దుర్భేద్యంగా ఉండేది. గ్లెన్ మెక్​గ్రాత్, జేసన్ గిలెస్పీ, బ్రెట్​లీ, షేన్ వార్న్​తో కూడిన బౌలింగ్ దళం ప్రత్యర్థి జట్లతో చెడుగుడు ఆడుకునేది. ఇలా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ బలంతో ఏళ్ల పాటు వరల్డ్ క్రికెట్​పై పెత్తనం చలాయించింది ఆసీస్. అలాంటి టీమ్​ను ఓ రాక్షసుడు భయపెట్టాడు.

వరుస విజయాలు, ట్రోఫీలు సాధించామనే గర్వంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అవతలి జట్లను పట్టించుకునేవారు కాదు. ప్రత్యర్థి ఆటగాళ్లను తిడుతూ, ట్రోల్ చేస్తూ రెచ్చగొట్టేవారు. దీని వల్ల అపోజిషన్ ప్లేయర్లు కాన్​సంట్రేషన్ కోల్పోయి ఔట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఎత్తుగడను పాకిస్థాన్ లెజెండరీ పేసర్ షోయబ్ అక్తర్ తుత్తునియలు చేశాడు. 2002లో కొలంబో వేదికగా ఆసీస్​తో జరిగిన టెస్ట్ మ్యాచ్​లో అక్తర్​ను బ్రెట్​లీ రెచ్చగొట్టాడు. పాక్ ఇన్నింగ్స్ టైమ్​లో అతడు విసిరిన ఓ బౌన్సర్ అక్తర్ హెల్మెట్​కు తగిలి బౌండరీకి వెళ్లింది. దీంతో అక్తర్ దగ్గరకు వచ్చిన బ్రెట్​లీ దమ్ముంటే కొట్టి చూపించమంటూ సవాల్ విసిరాడు. ఆ ఛాలెంజ్​ను స్వీకరించిన అక్తర్.. బౌలింగ్​ సమయంలో దుమ్మురేపాడు.

బ్రెట్​లీ గెలకడంతో అక్తర్ తనలోని రాక్షసుడ్ని బయటకు తీసుకొచ్చాడు. రెచ్చిపోయి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. రికీ పాంటింగ్, మార్క్ వా, స్టీవ్ వా సహా గిల్​క్రిస్ట్, షేన్​వార్న్​ను ఔట్ చేశాడు అక్తర్. పాంటింగ్, మార్క్​వా, గిల్​క్రిస్ట్​ను అతడు క్లీన్ బౌల్డ్ చేశాడు. గంటకు 150 కిలోమీటర్ల స్పీడ్​కు తగ్గకుండా బౌలింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. భీకర వేగంతో పాటు గాల్లోనే బంతిని స్వింగ్​ చేస్తూ కంగారూలతో ఓ ఆటాడుకున్నాడు.

అక్తర్ దెబ్బకు బాల్​ను టచ్ చేయాలన్నా వాళ్లు భయపడ్డారు. తనకు సవాల్ విసిరిన బ్రెట్​లీ బ్యాటింగ్​కు రాగానే అతడికి బుల్లెట్ స్పీడ్​తో ఓ ఫుల్​టాస్ విసిరాడు. అది కాస్తా వెళ్లి అతడి తొడ మీద బలంగా తాకింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడాడు. ఆ ఇన్నింగ్స్​లో 8 ఓవర్లలో 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను ఊపిరాడకుండా చేశాడు అక్తర్. అతడి దెబ్బకు 61-1తో ఉన్న టీమ్ కాస్తా 127కు కుప్పకూలింది. అయితే బ్యాటర్లు విఫలమవడంతో ఆ మ్యాచ్​లో పాక్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అందర్నీ భయపెట్టే ఆసీస్​ను ఆ రోజు అక్తర్ వణికించిన తీరు క్రికెట్ హిస్టరీలో స్పెషల్​గా ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.

Show comments