క్రీడా రంగంలో విషాదం! ఇండియన్ స్టార్ ప్లేయర్ కన్నుమూత!

  • Author singhj Updated - 11:00 AM, Wed - 16 August 23
  • Author singhj Updated - 11:00 AM, Wed - 16 August 23
క్రీడా రంగంలో విషాదం! ఇండియన్ స్టార్ ప్లేయర్ కన్నుమూత!

ప్రపంచ క్రీడల్లో ఫుట్​బాల్​కు ఉన్న పాపులారిటీనే వేరు. వందలాది దేశాల్లో ఈ గేమ్​కు చాలా క్రేజ్ ఉంది. ఫుట్​బాల్ స్టార్లను నెత్తిన పెట్టుకుంటారు అభిమానులు. ఫుట్​బాలర్ల సంపాదన ముందు ఏ ఇతర క్రీడల్లోని స్టార్స్ పనికిరారు. ఏడాదికి రూ.వేల కోట్లు సంపాదిస్తుంటారు ఫుట్​బాల్ ప్లేయర్లు. మన దేశంలో మాత్రం ఈ గేమ్​కు ఆదరణ అంతంత మాత్రమనే చెప్పాలి. ఫుట్​బాల్​లో భారత జట్టు ప్రదర్శన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అయితే ఒకప్పుడు మాత్రం ఫుట్​బాల్​లో భారత జట్టు అంటే అందరూ గుర్తుపట్టేవారు. ఇండియన్ ఫుట్​బాల్​కు 70వ దశకాన్ని గోల్డెన్ పీరియడ్​గా చెబుతుంటారు.

70వ దశకంలో అత్యుత్తమ ఫుట్​బాలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మహమ్మద్ హబీబ్. అలాంటి ఆయన మంగళశారం కన్నుమూశారు. హైదరాబాద్​కు చెందిన హబీబ్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 74 సంవత్సరాల హబీబ్​కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మరో హైదరాబాదీ సయ్యద్ నయీముద్దీన్ నాయకత్వంలో 1970లో బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో హబీబ్ కీలక సభ్యుడు. అయితే ఆయన కెరీర్​లో అత్యుత్తమ దశ కోల్​కతాలోనే గడిచింది. దాదాపు 18 ఏళ్ల పాటు అక్కడి ప్రధాన క్లబ్స్​లో కీలక ఆటగాడిగా కొనసాగారాయన.

ప్రఖ్యాత ఫుట్​బాల్ క్లబ్​లు మోహన్​బగాన్, ఈస్ట్ బెంగాల్, మహ్మదాన్ స్పోర్టింగ్​లకు హబీబ్ ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో 1977లో కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​లో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్​లో మోహన్​బగాన్ తరఫున బరిలోకి దిగాడు హబీబ్. ప్రత్యర్థి జట్టు కాస్మోస్ క్లబ్​లో ఫుట్​బాల్​ ఆల్​టైమ్ గ్రేట్ ప్లేయర్లు పీలే, కార్లోస్ ఆల్బర్టో ఉన్నారు. ఆ మ్యాచ్​ 2-2తో డ్రాగా ముగియడం గమనార్హం. ఇందులో మోహన్​బగాన్ తరఫున హబీబ్ ఒక గోల్ చేశాడు. మ్యాచ్ తర్వాత హబీబ్​ను పిలిచి పీలే ప్రశంసించడం విశేషం. 1965 నుంచి 1975 వరకు భారత జట్టు తరఫున ఆడిన హబీబ్​ను కేంద్ర ప్రభుత్వం 1980లో ప్రతిష్టాత్మక అర్జున పురస్కారంతో గౌరవించింది.

Show comments