VIDEO: రాంగ్‌ షాట్‌ ఆడి.. రక్తం చిందించిన పాక్‌ బ్యాటర్‌!

ఆసియా కప్‌ 2023లో భాగంగా ఇండియా-పాకిస్థాన్‌ మధ్యలో సోమవారం జరిగిన సూపర్‌ 4 మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. 357 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన పాక్‌.. స్వింగ్‌తో అల్లాడిస్తున్న భారత బౌలర్లను ఎదుర్కొలేక ఇబ్బంది పడింది. ఈ క్రమంలో కాస్త డిఫరెంట్‌గా ట్రై చేద్దామనుకున్నాడు ఆల్‌రౌండర్‌ అఘా సల్మాన్‌. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి ముక్కు పగలగొట్టుకున్నాడు. హెల్మెట్ లేకుండా ఆడటంతో బంతి అతని ముక్కు పక్క భాగం, కంటి కింద బలంగా తాకింది.

ఈ ఘటన పాకిస్థాన్ ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బాల్‌ బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకున్న తర్వాత మరింత వేగంగా వచ్చి.. అతని ముఖానికి చాలా బలంగా తాకింది. దీంతో ముఖం పగిలి.. రక్తం బయటికి వచ్చింది. దీంతో కొద్ది సేపు ఆటను నిలిపేశారు అంపైర్లు. వెంటనే అతనికి పాక్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌, ఫిజియో వచ్చి.. ఫస్ట్‌ ఎయిడ్‌ చేశారు. ఆ తర్వాత కూడా ధైర్యంగా స్విప్‌ షాట్లు ఆడిన సల్మాన్‌. జడేజా బౌలింగ్‌లో కసిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఒకటి రెండు బౌండరీలు కూడా కొట్టాడు. కానీ, ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. స్పిన్ బౌలింగే కదా అని తక్కువ అంచనా వేసి, హెల్మెట్‌ లేకుండా ఆడటంతోనే ఈ ప్రమాదం జరిగింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్‌ 24. ఓవర్లు మాత్రమే జరిగింది. రిజర్వ్‌ డే ఉండటంతో సోమవారం మ్యాచ్‌ను అక్కడి నుంచి ప్రారంభించారు. సోమవారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. మ్యాచ్‌ పూర్తిగా సాగింది. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కేఎల్ రాహుల్ 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 111(నాటౌట్), విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122(నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56, శుభ్‌మన్ గిల్ 52 బంతుల్లో 10 ఫోర్లతో 58 హాఫ్ సెంచరీలతో మంచి ఆరంభాన్ని అందించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 32 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి ఓటమి పాలైంది. చివరి ఇద్దరు బ్యాటర్లు గాయాలతో బ్యాటింగ్‌కు రాకపోవడంతో వారిని అబ్సెంట్‌ హర్ట్‌గా నిర్ధారించి పాక్‌ను ఆలౌట్‌గా ప్రకటించారు. దీంతో టీమిండియా 228 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో అఘా సల్మాన్‌ గాయపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బాబర్ ని వణికించిన బుమ్రా! బాల్ టచ్ కూడా చేయలేదు!

Show comments