Tirupathi Rao
Shivam Bhaje Movie Review And Rating In Telugu: టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న అశ్విన్ బాబు నుంచి వచ్చిన రీసెంట్ థ్రిల్లర్ మూవీ శివం భజే. ఈ మూవీ బజ్ అయితే బాగానే క్రియేట్ చేసింది. మరి.. సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.
Shivam Bhaje Movie Review And Rating In Telugu: టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న అశ్విన్ బాబు నుంచి వచ్చిన రీసెంట్ థ్రిల్లర్ మూవీ శివం భజే. ఈ మూవీ బజ్ అయితే బాగానే క్రియేట్ చేసింది. మరి.. సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.
Tirupathi Rao
కెరీర్ లో తక్కువ సినిమాలు చేసినా.. క్వాలిటీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చే హీరో అశ్విన్ బాబు. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో అప్సర్ డైరెక్ట్ చేసిన ‘శివం భజే’ సినిమాతో అశ్విన్ మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మరి.. ‘శివం భజే’ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
చందు (అశ్విన్ బాబు) ఓ ప్రైవేట్ బ్యాంకుకి చెందిన లోన్ రికవరీ ఏజెంట్. ఇలా లోన్స్ రికవరీ చేసే క్రమంలో అతనికి శైలజ (దిగంగనా సూర్యవంశీ) పరిచయం అవుతుంది. చాలా తక్కువ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడతారు. అయితే.. ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అదృష్టవశాత్తు చందుకి ఐ డోనర్ దొరుకుతారు. కంటిచూపు వచ్చాక చందుకి విచిత్రమైన విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓ గతం వెంటాడుతూ ఉంటుంది. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరివి? శివుడి ఉవాచగా చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? దీని వల్ల ఇండియాకి జరిగిన మేలు ఏమిటి? ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానమే ‘శివం భజే’ సినిమా!
కంప్యూటర్స్ లో ఆపరేటింగ్ సిస్టం (OS) అని ఒక సబ్జెక్టు ఉంటుంది. మన దగ్గర ఉండేది ఎంతటి హై ఎండ్ కంప్యూటర్ అయినా.. ఈ ఆపరేటింగ్ సిస్టంలో తేడా వస్తే.. ఆ కంప్యూటర్ ఎందుకు పనికిరాదు. దీన్నే సినిమాకి ఆపాదించి చెప్పాలంటే స్క్రీన్ ప్లే అనేది కూడా ఆపరేటింగ్ సిస్టం లాంటిదే. ఇదే సినిమాకి హార్ట్. ‘శివం భజే’ సినిమా సరిగ్గా ఇక్కడే తడబడింది. నిజానికి కథ మెయిన్ పాయింట్ చాలా కొత్తది. డైరెక్షన్ బాగుంది. స్టార్ కాస్ట్ అద్భుతంగా సెట్ అయింది. ఇలా సినిమాకి అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. కానీ.., స్క్రీన్ ప్లేలో లోపం కారణంగా కథ అక్కడక్కడే తిరుగుతూ ఉండటం ‘శివం భజే’ కి మైనస్ గా మారింది.
‘శివం భజే’ మొదలైన కాసేపు వరకు సరదాగా సాగిపోయే మూవీలానే అనిపిస్తుంది. మధ్యలో చైనా, పాకిస్థాన్, ఆపరేషన్ దలైలామా అంటూ ఓ సీక్వెన్స్ సపరేట్ గా నడుస్తున్నా అది అండర్ ప్లేలోనే సాగుతూ, హీరో క్యారెక్టరైజేషన్ హైలెట్ అవుతూ ఉంటుంది. సరిగ్గా ఇక్కడే లవ్ ట్రాక్ వర్కౌట్ కావడం, హైపర్ ఆది కామెడీ పంచ్ లు బాగా పేలడంతో మూవీ సరైన ట్రాక్ లోనే ఉంది అనిపిస్తుంది. ఇక హీరోకి గొడవలో కంటి చూపు పోయాక అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ హీరోకి ఏదో గతం గుర్తుకి వస్తుంది అని చెప్పడానికి దర్శకుడు 20 నిమిషాలకి పైగా సమయం తీసుకోవడంతో ల్యాగ్ అనిపిస్తుంది. అయితే.. హీరోకి పెట్టింది ఎవరి కళ్ళు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ రివీల్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ ఆఫ్ వరకు ఓకే అనిపించుకున్న ‘శివం భజే’.. సెకండ్ ఆఫ్ లో మెరుపులు మెరిపించడం ఖాయం అని అనిపిస్తుంది. ఎందుకంటే అందుకు కావాల్సిన స్టోరీ పోగ్రెషన్ అంతా దర్శకుడు ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నాడు. అయితే.. అసలు కథ చెప్పాల్సిన దగ్గర రచయత తేలిపోవడం, కథ ఎంత సేపటికీ అక్కడక్కడే తిరుగుతూ ఉండటం, క్రైమ్ ట్రాక్ అంతా పేవలంగా ముగియడంతో అప్పటి వరకు ఉన్న ఆడిటోరియం మూడ్ అంతా చెడిపోవడం మొదలవుతుంది. మధ్యలో కొన్ని మంచి సన్నివేశాలు పడ్డా, అసలు కథ ఏంటో ఇంకా అర్థం కాక.. ప్రేక్షకులు డైవర్ట్ అయిపోయారు. ఇక చివరలో డివోషనల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసినా.. ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ కి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
‘శివం భజే’కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అశ్విన్ బాబు. లుక్ పరంగా, యాక్టింగ్ పరంగా ఈ సబ్జెక్టుకి బాగా సెట్ అయ్యాడు. ఇక హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ అందంతో ఆకట్టుకుంది. హైపర్ ఆది, బ్రహ్మాజీ కామెడీ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. పోలీస్ ఆఫీసర్ మురళి పాత్రలో నటించిన అర్భాజ్ ఖాన్ ఆకట్టుకున్నారు. ఇక మురళీశర్మ, తనికెళ్ళ భరణి వంటి చాలా మంది సీనియర్ నటులు కొన్ని సన్నివేశాలకి మాత్రమే పరిమితం అయ్యారు. ఇక సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. వికాస్ బడిస సంగీతం సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ముఖ్యంగా బీజీఎమ్ మాత్రం వేరే లెవల్. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ వీక్ పాయింట్ గా అనిపించింది . అసలే స్క్రీన్ ప్లే లో ల్యాగ్ కనిపిస్తుండగా, అవుట్ పుట్ చూశాక కూడా ఎందుకు ట్రిమ్ చేయలేదో అర్థం కాకూండా ఉంది. ఇక మహేశ్వర్ రెడ్డి మూలి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌కి దర్శకుడిగా న్యాయం చేసినా.. రచయతగా మాత్రం కాస్త నిరాశ పరిచాడు.
రేటింగ్: 2.25
చివరి మాట: ‘శివం భజే’… సగం మాత్రమే భలే!