Idream media
Idream media
తెలంగాణలో ఏడాదిలోపే ఎన్నికలు వస్తాయని బలంగా విశ్వసిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ దిశగా బలోపేతం కావడానికి చర్యలు మొదలుపెట్టింది. దీనికోసం రైతు సమస్యలపై మే 6న వరంగల్‌లో తలపెట్టిన రాహుల్‌గాంధీ సభపై ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు.. బీసీ సమస్యలపైన వరంగల్‌లో నిర్వహించిన సోనియాగాంధీ సభ రూట్‌మ్యాప్ వేసిందని పార్టీ నేతలు చెబుతుంటారు. అదే క్రమంలో రైతు సమస్యలపైన మే 6న వరంగల్‌లో జరగనున్న రాహుల్ సభ కూడా.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేస్తుందన్న ఆశాభావం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దశాబ్దాలుగా రాష్ట్రంలో పాలక లేదా ప్రత్యామ్నాయ పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రత్యామ్నాయం విషయంలో బీజేపీతో పోటీని ఎదుర్కొంటోంది. తక్షణ సమస్యలపైన కాంగ్రెస్ పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అనేక అంశాల్లో టీఆర్‌ఎస్, బీజేపీ పరస్పర పోరాటమే తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం.. ఈ సభకు లక్షలాది మందిని సమీకరించి ప్రజల దృష్టిని ఆకర్షించాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగానే బూత్‌ల వారీగా జన సమీకరణ చేపట్టి సుమారు 5 లక్షల మందితో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను విజయవంతం చేసుకుని.. ఉధృత కార్యాచరణను చేపట్టాలని టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది. ఇటీవలి కాలంవరకూ అధికార పార్టీతో అటుంచి పార్టీ నేతల మధ్యనే అంతర్యుద్ధం కొనసాగుతూ వచ్చింది. అయితే అధిష్టానం జోక్యం చేసుకుని టీపీసీసీని తన అదుపులోకి తీసుకుంది. దశాబ్దకాలంలో జరగని విధంగా పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణ కాంగ్రెస్ లోని సీనియర్ నేతలతో సుదీర్ఘంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని కార్యక్రమాల నిర్వహణ వరకూ పార్టీ సభ్యుడు, వ్యూహకర్త సునీల్ కొనగాల బృందం చూస్తుందని సంకేతమిచ్చారు. దీంతో పార్టీ నేతలూ అంతర్గత విభేదాలను పక్కనపెట్టి తమ ప్రాబల్యం ఉన్న చోట్ల పట్టును పెంచుకునే పనిలో పడ్డారు.
మరో వైపు పార్టీ ముఖ్యనేతలను, వివిధ హోదాల్లో ఉన్న నాయకులపై ఎవరైనా బహిరంగ విమర్శలు చేసినా, సోషల్ మీడియాలో విమర్శించినా ఆ విమర్శలు చేసిన వారిపై బహిష్కరణ వేటు వేస్తానంటూ టీపీసీసీ రేవంత్‌రెడ్డి గట్టి హెచ్చరికనే పంపారు. 6న రాహుల్ సభను విజయవంతం చేశాక.. 7న అమరవీరుల కుటుంబాలు సహా టీఆర్‌ఎస్ పాలనలో బాధిత వర్గాలను రాహుల్‌కు పరిచయం చేసే పనీ పెట్టుకున్నారు. మొత్తం మీద రాహుల్ పర్యటనతో పార్టీలో ఒక జోష్ రానుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.