గవర్నర్‌ అధికారాలకు స్టాలిన్‌ కత్తెర.. కేంద్రం ఏమి చేయబోతోంది..?

  • Updated - 01:21 PM, Tue - 26 April 22
గవర్నర్‌ అధికారాలకు స్టాలిన్‌ కత్తెర.. కేంద్రం ఏమి చేయబోతోంది..?

కేంద్ర ప్రభుత్వ విధానాలను,పలు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వారి జాబితాలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా కేంద్రంపై పోరుకు సిద్ధమయ్యారు. గవర్నర్‌ ద్వారా రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయాలని చూస్తోందనే భావనలో ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఆయా రాష్ట్రాల గవర్నర్ల అధికారాలకు కత్తెర వేస్తున్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్‌ను ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆ రాష్ట్ర సర్కార్‌ ఆహ్వానించలేదు. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. తెలంగాణ కన్నా ముందే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్‌ అధికారాలకు కత్తెర వేసే ప్రయత్నాలు చేశారు.

తాజాగా ఈ జాబితాలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా చేరారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీల్లో వైస్‌ ఛాన్సలర్స్‌(వీసీ)ను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా చట్టసవరణ చేశారు. ఈ బిల్లును రాష్ట్ర శాసనసభలో సోమవారం విద్యాశాఖ మంత్రి పొన్ముడి ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోందని, ఈ తరహాలోనే రాష్ట్రంలోనూ నియమిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ బిల్లుకు అందరూ మద్ధతు ఇవ్వాలని కోరారు.

కాగా, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. డీఎంకే, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు మద్ధతు ఇవ్వడంతో బిల్లు ఆమోదం పొందింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show comments