మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. 8 మంది అరెస్ట్‌

తెలంగాణ రాజకీయాలలో సంచలన వ్యవహారం తెరమీదకు వచ్చింది. తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందనే విషయాన్ని పోలీసులు కనుగొన్నారు. మంత్రిని హత్య చేసేందుకు 12 కోట్ల రూపాయలు సుపారీ కూడా ఇవ్వడానికి కొంతమంది వ్యక్తులు సిద్ధమయ్యారనే విషయం మీడియాలో రావడమేకాక ఈ ఈ విషయంలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయం స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసలు ఏం జరిగింది? అనే విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 23న ఫరూక్‌, హైదర్‌ అలీ అనే వ్యక్తులు సుచిత్ర వద్ద ఒక లాడ్జిలో దిగారని, 25న ఇద్దరు బయటకు టీ తాగేందుకు వెళ్లినప్పుడు నాగరాజు, కొందరు వ్యక్తులు కత్తులతో వారిని వెంబడించి చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఫరూక్‌, హైదర్‌ అలీ తప్పించుకుని 5 గంటల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేట్‌బషీర్‌బాద్‌ పోలీసులు సెక్షన్‌ 307, 120బీ, 115 రెడ్‌విత్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 25 ఏబీ ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి విచారణ చేశామని పేర్కొన్నారు.

ఆ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. విచారణలో యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌ అనే ముగ్గురు మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చి కొంపల్లి ఏరియాలోని సుచిత్రలో వీరిని వెంబడించి దాడికి చేసేందుకు యత్నించారని వారిని 26న అరెస్ట్‌ చేశామని అన్నారు. 27న మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా నాగరాజు కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో రాఘవేంద్ర రాజు, కొందరితో కలిసి హత్యకు కుట్రపన్నారని చెప్పాడని అన్నారు. ఆ తర్వాత విచారణ జరుపగా రాఘవేంద్ర రాజు, మున్నూర్‌ రవి, మధుసూదన్‌ రాజు ఢిల్లీలో ఉన్నట్లు తెలిసిందని అన్నారు. అయితే, వీరికి అక్కడి వారి గురించి సమాచారం లేదని.. వారి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్‌లో ఉన్నట్లు తెలిసి వారిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చామని అన్నారు.

రాఘవేంద్ర రాజు, రవి, మధుసూదన్‌, అమరేందర్‌ కలిసి మహబూబ్‌నగర్‌ నుంచి వైజాగ్‌ వెళ్లి.. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి షెల్టర్‌ తీసుకున్నారు. వీరికి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డ్రైవర్‌ థాపా, పీఏ రాజు హెల్ప్ చేశారని విచారణలో తేలిందని అన్నారు. అందుకే వారికి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో నోటీసులు ఇచ్చి.. అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తీసుకువచ్చామని అన్నారు. వారిని ప్రశ్నించగా హత్యకు కుట్ర చేసిన కేసు వెలుగులోకి వచ్చిందని అన్నారు.

రాఘవేంద్ర రాజు నుంచి రెండు రౌండ్ల 9ఎంఎం, పిస్టల్‌.. దుండిగల్‌ ఫారెస్ట్‌ ఏరియాలో 6 రౌండ్స్‌ రివాల్వర్‌ రికవరీ చేసి వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని అన్నారు. రాఘవేంద్ర రాజును ప్రశ్నించగా. రాష్ట్ర కేబినెట్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు వీరంతా కుట్ర పన్నినట్లు తేలిందని అన్నారు. ఈ కుట్రలో రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి, అమరేందర్‌ రాజు, మధుసూదన్‌, షెల్టర్‌ ఇచ్చిన వ్యక్తితో మరో ముగ్గురు భాగస్వాములైనట్లు విచారణలో తేలిందని రవీంద్ర పేర్కొన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని, పోలీసు కస్టడీలోకి నిందితులను తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం’ అని ఆయన పేర్కొన్నారు.

Show comments