సస్పెన్షన్‌పై హైకోర్టుకు బీజేపీ ఎమ్మెల్యేలు

శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పి బడ్జెట్‌ సమావేశాలకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. కాగా, శాసనసభలో ప్రవేశం కోసం బీజేపీ ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నుంచి తమను సస్పెండ్‌ చేయడం అక్రమమని పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఎం.రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్‌, రాజాసింగ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సమావేశాలకు అనుమతించేలా అసెంబ్లీ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. బడ్జెట్‌ సెషన్‌ మొత్తం తమను సస్పెండ్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అసెంబ్లీ బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకమని పేర్కొన్నారు. బడ్జెట్‌ సెషన్‌ తొలిరోజైన సోమవారంనాడు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. గవర్నర్‌ పదవి రాజ్యాంగబద్ధమైన పోస్టు అనే వాస్తవాన్ని గుర్తించకుండా… కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, శత్రువుగా చూస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. బీజేపీతో ఉన్న రాజకీయ శత్రుత్వం కారణంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కావాలనే గవర్నర్‌ ప్రసంగం లేకుండా చేసిందని కోర్టుకు తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 176 ప్రకారం గవర్నర్‌ ప్రసంగం అనేది రాజ్యాంగపరమైన విధి అని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 7న నల్ల కండువాలను ధరించి… అసెంబ్లీలో తమకు కేటాయించిన స్థానాల్లో ఉన్నట్టు తెలిపారు. సమావేశాలు ప్రారంభించే ముందు ఒకసారి తమకు మైక్‌ ఇవ్వాలని.. గవర్నర్‌ ప్రసంగం గురించి మాట్లాడే అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు. అసెంబ్లీ రూల్‌ 342 ప్రకారం పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ను ప్రస్తావించే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రసంగం ప్రారంభమైన 14 నిమిషాల తర్వాత… తమకు పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పీకర్‌ పోడియం వైపు ముందుకు వెళ్లారని తెలిపారు. ఇదంతా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియేనని పేర్కొన్నారు.

తమను సస్పెండ్‌ చేసిన తీర్మానం కాపీని కూడా అసెంబ్లీ కార్యదర్శి ఇవ్వలేదని తెలిపారు. ఇలా సస్పెండ్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అసెంబ్లీ రూల్స్‌ ప్రకారం.. ఒక సభ్యుడు స్పీకర్‌ అధికారాన్ని పట్టించుకోకపోవడం లేదా కావాలని సభకు ఆటంకం కలిగించిన ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సభ నుంచి సస్పెండ్‌ చేయాలని పేర్కొన్నారు.తమ విషయంలో ఎలాంటి ఉల్లంఘన లేకుండానే స్పీకర్‌ గరిష్ఠంగా శిక్ష విధించారని తెలిపారు. ఈ మేరకు సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టేయాలని, తమను సభకు అనుమతించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ధర్మాసనం ఎదుట బుధవారం విచారణకు రానుంది. కోర్టు ఏం తీర్పు చెప్పనుందో చూడాలి.

Show comments