కేడర్‌ విభజన.. కోర్టులో టీఎస్‌ సీఎస్‌ పోరు..

ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించినప్పటికీ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల అండతో తెలంగాణలో కొనసాగుతున్న చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా కేంద్రం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ చేపట్టింది. సోమేశ్‌కుమార్‌ తరపున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ… ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కేటాయింపు ప్రక్రియలో కేంద్రం అఖిల భారత సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించిందని తెలిపారు.

ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా రెండు రాష్ర్టాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం అసంబద్ధంగా వ్యవహరించిందని తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆరోపించారు. నిబంధనల ప్రకారం కేటాయింపులు జరిగి ఉంటే తాను తెలంగాణకు వచ్చేవాడినని తెలిపారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని అధికారుల విభజన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీలో సభ్యుడిగా చేర్చడాన్ని తప్పుబట్టారు. పీకే మహంతి కుమార్తె స్వేతా మహంతి, అల్లుడు రజత్‌ సైనీ ఇరు రాష్ర్టాల మధ్య విభజించాల్సిన అధికారుల జాబితాలో ఉన్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీలో పీకే మహంతి సభ్యుడిగా ఉండటం నిబంధనలను ఉల్లంఘించడమే అన్నారు.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ర్టాల మధ్య అధికారుల విభజన కోసం కేంద్రం మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుందని, దీనికి విరుద్ధంగా ఈ బాధ్యతలను కమిటీకి అప్పగించారని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు కమిటీ రూపొందించిన మార్గదర్శకాలకు చట్టబద్ధత లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం… పీకే మహంతిని పార్టీగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. దీనికి డీవీ సీతారామమూర్తి సమాధానం ఇస్తూ.. 2014 జూన్‌ 1 వరకు పీకే మహంతి సర్వీసులో ఉన్నారని.. అందుకే ఆయనను పార్టీగా చేర్చలేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.

Show comments