Idream media
Idream media
ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకున్న కాన్ఫిడెంటే వేరబ్బా. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా.. ఈ ఎన్నికల తర్వాత పార్టీ లేదు.. అదేదో లేదు.. అని వ్యాఖ్యానించిన ఆయనే.. ఇటీవల మైకు దొరికిందంటే చాలు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే టీడీపీకి 160 స్థానాలు పక్కాగా వస్తాయని జంకూ బొంకూ లేకుండా చెప్పేస్తున్నారు. అందుకే ఆయన కాన్ఫిడెంటే వేరబ్బా.. అని అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే.. తిరుపతే కాదు.. ప్రతి ఎన్నికలోనూ టీడీపీ బొక్కబోర్లా పడుతూనే ఉంది. పైకి లేస్తున్న దాఖలాలు ఇప్పటికైతే ఎక్కడా కనిపించడం లేదు. కానీ టీడీపీ వర్గాలు మాత్రం ముందస్తు ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో టీడీపీదే గెలుపని తెగ కలలు కంటున్నాయి.
ఆ వర్గాల్లో చంద్రబాబు తర్వాత అచ్చెన్న ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్‌పై వ్యతిరేకతతో ఉన్నారంటూ పదే పదే ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం దెబ్బకు ఏపీ మరో శ్రీలంక అవుతుందంటూ లింకు కుదరని మాటలు చెబుతున్నారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ ను కూడా తెగ పొగిడేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వ తప్పుల్ని ఎండగడుతున్నారని.. ఆయన్ను ఎదుర్కోలేక దత్తపుత్రుడని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు తరహాలోనే అచ్చెన్నాయుడు కూడా పవన్ జపం చేయడం ఇటీవల పెరిగింది. అలాగే.. ఏపీలో ముందస్తు ఎన్నికలు అన్న ఊహాగానాలను కూడా తెరపైకి తెస్తున్నారు. నిజంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న అంచనాలు కూడా వేసుకోకుండా మాట్లాడేస్తున్నారు.
తాజాగా ముందస్తు ఎన్నికలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ‘‘రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సర్వేలు చేయించుకున్నారు. 65 శాతం ప్రజలు సీఎం జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని సర్వేల్లో తేలింది. సర్వేల్లో కొంతమంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గింది. ఈ రెండేళ్లలో ఆ ఎమ్మెల్యేలు పని తీరు మార్చుకోవాలి’’ అని చెప్పినట్లుగా వెల్లడించారు. అంటే దీన్నిబట్టి సర్కారుకు ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని తెలుస్తోంది.
జగన్ ఆదేశాలతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి మరింత దూకుడు పెంచనున్నారు. నిరంతరం నియోజకవర్గాల్లో తిరుగుతూ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించి సమస్యలను అక్కడి బుక్ లో రాయాలని జగన్ ఇప్పటికే ఆదేశించారు. సచివాలయంలో రాసిన సమస్యలను తాను తీసుకుని పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం సమస్యలు లేని ప్రాంతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు తోడు జగన్ కూడా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ సక్రమంగా అమలైతే ఏపీలో వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కూడా తిరుగుండదు. ఇలాంటి పరిస్థితుల్లో అచ్చెన్న ఆకాంక్ష నెరవేరాలంటే.. ఎందుకులేండి.. ఏం చేసినా 160 కాని పని. రాని సీట్లు.