Idream media
Idream media
మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓటర్లు వేసిన ఓటును ధ్రువీకరిస్తూ ఈవీఎంల నుంచి వచ్చే కాగితమే వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్). ప్రస్తుతం నియోజకవర్గానికి ఐదు పోలింగ్ బూత్‌లను ఎంచుకొని, లెక్కింపు పూర్తయిన తర్వాత ఆ బూత్ లల్లో వీవీప్యాట్లను తనిఖీ చేస్తున్నారు. అయితే ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించడానికంటే ముందే వీవీప్యాట్లను తనిఖీ చేయాలని, నియోజకవర్గానికి 25 వరకు బూత్‌లను ఎంచుకునేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త రాకేశ్‌కుమార్ మంగళవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరగా.. న్యాయస్థానం నిరాకరించింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు.
ప్రస్తుతం ఈవీఎంలల్లోని ఓట్లను లెక్కించిన తర్వాత వీవీప్యాట్లను తనిఖీ చేస్తున్నారని, ఆ సమయంలో ఏజెంట్లు కూడా ఉండరని తెలిపారు. ఈ విధానంలో పారదర్శకత ఉండదన్నారు. కాబట్టి ఓట్ల లెక్కింపు కంటే ముందుగానే వీవీప్యాట్లను తనిఖీ చేసేలా ఆదేశించాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాన్ని అత్యవసర విచారణ జాబితాలో ఎందుకు చేర్చారని ప్రశ్నించింది. చివరి నిమిషంలో వస్తే తాము మాత్రం ఏం చేయగలమని జస్టిస్ రమణ ప్రశ్నించారు. ఈసీ తరపున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ అరోరా వాదనలు వినిపిస్తూ.. అసలు ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. వీవీప్యాట్ల తనిఖీలకు సంబంధించి 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నడుచుకుంటున్నామని తెలిపారు. స్పందించిన సీజేఐ.. ‘‘మేం ఇప్పుడు జోక్యం చేసుకోలేం. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియలోనే ఓట్ల లెక్కింపును జరగనిద్దాం. వారు (ఈసీ) తీర్పును అనుసరించే పనిచేస్తున్నట్లు ప్రకటించారు’’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ పిటిషన్‌ను సాధారణ విచారణ జాబితాలోనే చేర్చుతామన్నారు.