ఎవ‌రితో పొత్తు అంటే..? సోము చమత్కారం..!

ఓ వైపు బీజేపీ ఆవిర్భావ దినోత్స‌వాలు, మ‌రోవైపు ఉత్త‌రాంధ్ర యాత్ర‌ల‌తో ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు బిజీగా గ‌డుపుతున్నారు. చాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా కేంద్రంలోని బీజేపీ చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. అలాగే.. రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల్లోనూ కేంద్రం వాటా ఉంద‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ కార‌ణంగా కేంద్రంపై పెల్లుబికుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు శ‌తవిధాలా కృషి చేస్తున్నారు. అలాగే.. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్ర‌క‌టించారు.

విశాఖలోని లాసన్స్‌బేకాలనీలో ఉన్న బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ని ఇక్కడే కొనసాగించాలని ఏపీ బీజేపీ గతంలోనే కేంద్రానికి స్పష్టం చేసిందని చెప్పారు. గనుల రద్దు విషయం మైన్స్‌ పాలసీలో భాగంగానే జరిగిందని తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ వస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా.. మీడియా స‌మావేశంలో టీడీపీ, జనసేనతో పొత్తుపై ప్ర‌శ్న‌లు రాగా సోము తెలివిగా స్పందించారు. టీడీపీతో పొత్తు ఉంటుంది అని కానీ, ఉండ‌దు అని కానీ చెప్ప‌లేదు.

ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు ఉంద‌ని చెబుతూ.. రాష్ట్రంలో 1.35 కోట్ల రైస్‌ కార్డుదారులతో తమ పొత్తు ఉంటుందని, 30 లక్షల ఇళ్లు పొందిన ప్రజలతో పొత్తు ఉంటుందని, 1.35 లక్షల జాతీయ ఉపాధి హామీ జాబ్‌ కార్డులు పొందిన వారితో తమ పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ స‌మాధానం విన్న మీడియా మిత్రులు అబ్బా ఛ‌.. అంటూ గుస‌గుస‌లాడుకున్నారు.

Show comments