నేను చూస్తూ కూర్చునే రకం కాదు.. బీజేపీ కి శివసేన ఎంపీ హెచ్చరికలు

‘‘నా ఆస్తులు జప్తు చేయండి. నన్ను కాల్చండి. జైలుకు పంపండి. అయినా భయపడేది లేదు. నేను బాలాసాహెబ్‌ థాకరే అనుచరుడిని. నిజమైన శివసైనికుడిని. పోరాడతాను. ప్రతి ఒక్కరి వ్యవహారం బయట పెడతాను. వాళ్లను డ్యాన్స్‌ చేయనివ్వండి. నేను చూస్తూ కూర్చునే రకం కాదు. చివరికి నిజమే గెలుస్తుంది’’ అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, ఆయన కుటుంబంతో పాటు ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌, ఆయన కుటుంబ కంపెనీ, శారదా చిట్‌ఫండ్‌ కంపెనీలపై దాడులు జరిపి పెద్ద మొత్తంలో ఆస్తులను జప్తు చేసింది.

ముంబైలోని అలీబాగ్‌లో సంజయ్‌ రౌత్‌, ఆయన కుటుంబానికి చెందిన 8 స్థలాలు, దాదర్‌ సబర్బన్‌లోని ఫ్లాట్‌ను ఈడీ అటాచ్‌ చేసింది. రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ఈ ఆస్తులను స్తంభింపజేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఇదే కేసులో మహారాష్ట్రకు చెందిన వ్యాపారి ప్రవీణ్‌ రౌత్‌ను ఫిబ్రవరిలోనే అరెస్టు చేసిన ఈడీ ఆయనపై చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. పీఎంసీ బ్యాంక్‌ మోసం కేసుతో సంబంధం ఉన్న మరో మనీలాండరింగ్‌ కేసులో ప్రవీణ్‌ రౌత్‌ భార్య మాధురితో సంబంధాలపై సంజయ్‌ రౌత్‌ భార్య వర్షా రౌత్‌ను గత ఏడాది ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈడీ అధికారులపై వచ్చిన ఆరోపణల దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ వేయగానే రౌత్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ జరగడం విశేషం.

మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి వేసే ప్రయత్నాలకు సహకరించనందుకే తనను బీజేపీ టార్గెట్‌ చేసిందని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. మరోవైపు సంజయ్‌ రౌత్‌ ఆస్తుల జప్తు ఘటనపై మహావికాస్‌ అఘాడీ(ఎంవీఏ) నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షేనని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు. ఈడీ చర్య రాజకీయ ప్రేరేపితమన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం లేదని ఆరోపించారు.

హోం మంత్రి దిలీప్‌ పాటిల్‌ కూడా ఈడీ చర్యలను తప్పుబట్టారు. ‘‘రౌత్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. దర్యాప్తు జరపలేదు. దీన్ని బట్టి విపక్షనేతల పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తోందో తెలుస్తోంది’’ అని పాటిల్‌ విమర్శించారు. ఎంవీఏ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు అన్ని స్థాయిల్లోనూ ప్రయత్నాలు జరుగుతున్నా తమ సర్కారుకు ఐదేళ్ల పాటు ఢోకా లేదన్నారు. రౌత్‌పై ఒత్తిడి పెంచేందుకు జరుగుతున్న కుట్రగా ఎస్సీపీ నేత, రాష్ట్ర మంత్రి జయంత్‌ పాటిల్‌ అభివర్ణించారు. ‘కూటమి’ నేతల గొంతులను నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్‌ తాప్సే విమర్శించారు. మరోవైపు, ఈడీ అధికారులు కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న సంజయ్‌ రౌత్‌ ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు మహారాష్ట్ర సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది.

Show comments