Idream media
Idream media
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) చిత్రా రామకృష్ణ చుట్టూ ఉచ్చుబిగిసింది. ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ కేసులో సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. ఇప్పటికే సీబీఐ ఆమెను పలుమార్లు ప్రశ్నించింది. ఈ రోజు తెల్లవారుజామున, కో-లొకేషన్ కేసులో ఆమెను ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. దీంతో చిత్రా రామకృష్ణను అరెస్ట్ చేసిన అనంతరం ఆమెను వైద్యపరీక్షలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఉంచినట్లు సమాచారం. ఆమెను ఈరోజు సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇక చిత్రా రామకృష్ణన్ సీఈవోగా ఉన్నకాలంలో ఎన్‌ఎస్‌ఈలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఆమె ఓ హిమాలయ యోగి ఆదేశాల మేరకు పనిచేశారని, కీలక సమాచారాన్ని లీక్ చేశారని, అనర్హులకు పదవులిచ్చారని ఆమె మీద పలుఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాల మీద ఆమెపై 2018 మే లో కేసు నమోదైంది. ఆమెను విచారిస్తున్న సీబీఐ బెయిల్‌ను వ్యతిరేకించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైనప్పటి నుంచి ఆమెను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని అంచనాలు ఉన్నాయి. చెన్నైకి చెందిన ఎన్‌ఎస్‌ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీఓఓ) ఆనంద్ సుబ్రమణ్యాన్ని సీబీఐ ఫిబ్రవరి 25న అరెస్టు చేసింది.
ఆ హిమాలయ యోగి మరెవరో కాదు ఆనంద్ సుబ్రమణ్యం అనే అనుమానాలు ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ పనితీరులో సుబ్రమణ్యం జోక్యం చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణకు సలహాలు ఇచ్చేవారనీ ఆమె ఆయన ఆదేశానుసారం నడుచుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. సుబ్రమణ్యం మార్చి 6 వరకు సీబీఐ కస్టడీలో ఉన్నారు. 2013లో చిత్ర, ఆనంద్ సుబ్రమణ్యంను చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా నియమించారు. అప్పటి దాకా అలాంటి పదవే లేదు కానీ అతనికోసమే సృష్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి.