అప్పు చేసి పోటీ.. ఓడిపోవడంతో ఆత్మహత్య..

ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది. కానీ రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు కావాలి. ప్రస్తుత కాలంలో రాజకీయాలు డబ్బుతో ముడిపడిఉన్నాయి. ధన బలం ఉన్న అభ్యర్థితో పోటీ పడాలన్నా, ఎన్నికల్లో పాల్గొనాలన్నా.. గెలవాలన్నా డబ్బు కావాలి. ఎన్నికల్లో పోటీ చేయాలి, కార్పొరేటర్‌ అవ్వాలనే ఆశ తమిళనాడులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు దారితీసింది.

ఈ నెల 19వ తేదీన తమిళనాడులో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తిరుప్పూర్‌ కార్పొరేషన్‌లోని 36వ డివిజన్‌ నుంచి మణి(55) అనే వ్యక్తి కమల్‌ హాసన్‌ మక్కం నీది మయ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు లేకపోవడంతో తెలిసిన వారి నుంచి 50 వేల రూపాయలు అప్పు చేశారు. గెలుపు కోసం మణి తీవ్రంగా శ్రమించాడు. అయితే ఒటమి మణిని పలకరించింది. ఆ ఓటమి తెచ్చిన వివాదం.. తాజాగా మణి ప్రాణాలను తీసుకుంది.

ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మణి ఓడిపోయాడు. కానీ చేసిన అప్పు మాత్రం అలానే ఉంది. అప్పు ఇచ్చిన వారు ఇప్పు తీర్చమని ఇంటికి వచ్చారు. మనకు ఎన్నికలు ఎందుకు అని వారించిన భార్య మాట వినకుండా పోటీ చేసిన మణి.. అప్పు ఇచ్చిన వారు ఇంటికి రావడంతో భార్య ముందు దోషిగా నిలబడ్డాడు. భార్యా భర్తల మధ్య మాటా మాటా పెరిగింది. అది కాస్త పెద్దదైంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మణి అర్థరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. కార్పొరేటర్‌ అవ్వాలనే ఆశ చివరకు మణి ప్రాణాలను తీసుకోవడంతో భార్య కన్నీరుమున్నీరవుతోంది.

Show comments