Idream media
Idream media
గెజిట్‌లో సవరణలు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డుల్లో మళ్లీ కదలిక వచ్చింది. గెజిట్ అమలుకు అవసరమైన నిధులు (వన్‌టైమ్ సీడ్ మనీ) జమ చేయడానికి వచ్చే జూలై 14 వరకు అవకాశమిచ్చారు. అనుమతిలేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించి, అనుమతులు తీసుకోవడానికి కూడా జూలై 14 దాకా అవకాశం ఇవ్వడం, ప్రాజెక్టుల డీపీఆర్‌ల మదింపునకూ ఇదే గడువు ఇవ్వడంతో మళ్లీ తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాయాలనే యోచనలో బోర్డులున్నాయి. దీంతో బోర్డుల్లో వరుస అంతర్గత సమావేశాలు జరుగుతున్నాయి.
రెండు బోర్డులకు ఒకరే చైర్మన్ (కృష్ణా బోర్డు చైౖర్మన్ మహేంద్ర ప్రతాప్‌సింగ్)గా ఉండటంతో వచ్చేవారం బోర్డుల ఉమ్మడి సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. అందుకు ఎజెండాను సిద్ధంచేసే పనిలో అధికారులున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను బోర్డుల సమావేశంలో ఆమోదించుకోవాల్సి ఉంది. అప్పుడే నిధుల వినియోగానికి బోర్డులకు అవకాశం ఉంటుంది. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ సమర్పించిన 7 డీపీఆర్‌ల్లో మూడు బోర్డుకు చేరాయి.
ఏపీ రెండు ప్రాజెక్టుల డీపీఆర్‌లను నేరుగా బోర్డుకే సమర్పించింది. వెంకటనగరంతోపాటు మరో ప్రాజెక్టు డీపీఆర్‌ను అందించింది. తెలంగాణ డీపీఆర్‌లకు సీడబ్ల్యూసీ అన్ని పరిశీలనలు చేయడంతో వీటిపై గోదావరి బోర్డు సమావేశంలోనే చర్చించి టెక్నికల్ అడ్వయిజరీ కమిటీకి పంపించాల్సి ఉంది. గోదావరి బోర్డు సమావేశానికి తెలంగాణ పట్టుబడుతోంది. కృష్ణాలో అయితే తెలుగు రాష్ట్రాలు డీపీఆర్‌లు అందించలేదు. కృష్ణాలో అనుమతిలేని జాబితాలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందించడం, ఆర్డీఎస్‌పై అధ్యయన బాధ్యతను పూణేకు చెందిన సంస్థకు అప్పగించడం, బోర్డు బడ్జెట్ వంటి అంశాలు కృష్ణా బోర్డులో చర్చించే ఎజెండాలో భాగం కానున్నాయి.