Idream media
Idream media
సాధారణంగా ఒక్కసారి రౌడీషీటర్ అయ్యారు అంటే ఇక వారిని సామాన్య ప్రజలు మొదలు పోలీస్ అధికారుల వరకు ఒక వింత వ్యక్తిని చూసినట్టు చూస్తూ ఉంటారు. అనేక నేరాలలో భాగస్వాములైన వారి మీద రౌడీషీట్లు తెరుస్తూ ఉండటం అనేది చాలా సహజం. అయితే ఒక్కసారి రౌడీషీటర్ గా మారారు అంటే ఇక వారి జీవితం అయిపోయింది అన్నట్లుగా నేరాలలో భాగమవుతూ ఉంటారు. అలాంటి వారిలో మార్పు తీసుకురావడం కోసం విజయవాడ పోలీసులు ఒక వినూత్న ప్రయత్నం చేశారు. సాధారణంగా తమ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను పిలిచి.. అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం మాములే.
కానీ విజయవాడ పోలీసులు ఓ అడుగు ముందుకేసి కాస్త భిన్నంగా ఆలోచించారు. రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారికి ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. తాజాగా విజయవాడలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డీసీలు, బీసీలు, సస్పెక్ట్‌లు, రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. సింగ్ నగర్ లో ఉన్న మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో ఉన్న రౌడీలకు జాబ్ మేళాలో ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్దతో కలసి మార్చి 5న ప్రత్యేకంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.
కౌన్సెలింగ్ లో భాగంగా గంజాయి, గుట్కా, మద్యం లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని వీడి మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో మెలగాలని రౌడీషీటర్లకు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోవడంతో పాటుగా నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్లకు వారి పేరు మీద ఉన్న షీట్‌లను తీసివేసి.. ఉపాధి అవకాశం కల్పించేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ విధంగా వారికి ఒక ఉపాధి మార్గం చూపడం అనేది గొప్ప విషయం అని చెప్పాలి.