నేడు జ‌న‌సేన కీల‌క భేటీ.. ఎజెండా ఇదేనా?

వైసీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డానికేనంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్పుడ‌ప్పుడూ సినీ వేదిక నుంచి రాజ‌కీయ వేదిక‌పైకి వ‌స్తున్నారు. ప్ర‌భుత్వం చేసే ప‌నుల‌పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలలోనూ అదే జ‌రిగింది. ఆ కార్య‌క్ర‌మం అనంత‌రం పార్టీని విస్త‌రించేందుకు శ్రేణులు తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స‌భ్య‌త్వ న‌మోదు ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎక్కడికక్కడ నిరసనలు తెలపడంతో పాటు, రాష్ట్ర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.

కాగా.. నేడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా కూడా ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టేందుకు నాయ‌క‌త్వం ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. ప్ర‌ధానంగా కొత్త జిల్లాల ఏర్పాటులో ఎక్క‌డైనా లొసుగులు ఉన్నాయా అని రంధ్రాన్వేష‌ణ చేస్తోంది.రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వలేదు. పాలకులు తమ చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్లారు. జిల్లాల విభజన మొత్తం లోపభూయిష్టంగా నిలిచింది’’ అని జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్ ఇప్ప‌టికే విమర్శించారు.

‘‘ప్రభుత్వం ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వారు ఎదుర్కొనే దూరాభారాలను, ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదు? ఎప్పటి నుంచో జిల్లా కోసం డిమాండ్‌ ఉన్న ప్రాంతాలపై ఎందుకు అధ్యయనం చేయలేదు? ఎటపాక, కుకునూరు లాంటి మండలాల్లో గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సామాన్య, పేద గిరిజనులు జిల్లా కేంద్రంలో అధికారిని కలవాలంటే కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. ఈ తరహా విభజన వల్ల ప్రజలకు పాలనను ఏ విధంగా చేరువ చేస్తున్నారో వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు.

ఈ నేప‌థ్యంలో నేడు జ‌ర‌గ‌బోయే స‌మావేశంలో కూడా ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నారు. అలాగే.. వైసీపీ ప్రభుత్వ పాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం, పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, రైతులు వ్యవసాయ స్థితిగతులు వంటి తదితర అంశాలపై పార్టీ నేతలతో చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొననున్నారు. మరోవైపు పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, విభాగాల ఛైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరు కానున్నారు.

Show comments