పేరుకే పొత్తు.. స్వ‌ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద పీట‌?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోనివ్వం.. క‌లిసే పోటీ చేస్తాం.. అన్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయి. కార్యాచ‌ర‌ణ చూస్తే వేర్వేరుగా ఉంటోంది. పార్టీల్లోని నేత‌ల మాట‌లు కూడా భిన్నంగా ఉంటున్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల్లో కూడా ఓ పార్టీ ఉంటే.. మ‌రో పార్టీ క‌నిపించ‌డం లేదు. గ‌తంలో ఎన్న‌డూలేని రీతిలో బీజేపీ – జ‌న‌సేన పార్టీల పొత్తు కొన‌సాగుతుండ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజ‌గా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి వ్యాఖ్య‌లు కూడా కొత్తచ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి.

బీజేపీ, జ‌న‌సేన రెండు పార్టీలూ ఏదో ఒక కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల్లో ఉండే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. కానీ.. ల‌క్ష్యం ఒక‌టే కానీ.. ఎజెండా భిన్నంగా ఉంటోంది. బీజేపీ చేసే ఉత్త‌రాంధ్ర యాత్ర త‌మ‌కు సంబంధం లేన‌ట్లుగా జ‌న‌సేన ఉంటోంది. కాషాయ పార్టీ కూడా ఆ పార్టీతో చ‌ర్చించకుండానే సొంతంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. మ‌రోవైపు జ‌న‌సేన తీరు కూడా అలాగే ఉంటోంది. ఈ నెల 12 నుంచి ఏపీలో పవన్ కళ్యాణ్ పరామర్శ యాత్ర చేప‌ట్ట‌నున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతపురం నుంచి పవన్ తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ యాత్ర‌తో బీజేపీకి సంబంధం లేన‌ట్లుగా జ‌న‌సేన ప్ర‌క‌ట‌న‌లు ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా బీజేపీ – జనసేన పొత్తుపై పురందేశ్వ‌రి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే.. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ ఉద్య‌మంకు సంబంధించి కూడా జ‌న‌సేన‌ను ఉద్దేశించి ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండావిష్కరించిన పురంధేశ్వరి విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నాయకులకు బీజేపీని తప్పుపట్టే అర్హత లేదన్న ఆమె.. మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ మాతో చర్చిస్తే.. మేము కూడా స్పందిస్తామ‌ని పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు సంబంధించి ప‌వ‌న్ కూడా ఓ రోజు ఉద్య‌మం చేశారు. ప‌లుమార్లు కార్మికుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌తో చ‌ర్చించ‌కుండానే ప‌వ‌న్ అలా చేయ‌డం త‌గ‌ద‌నే రీతిలో పురందేశ్వ‌రి వ్యాఖ్య‌లు ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే.. బీజేపీ – జ‌న‌సేన పొత్తు కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అవుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న‌లో ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ క‌నిపించ‌డం లేదు. తాజాగా ఏపీలో కార్యక్రమాలు వేరుగానే ఉంటాయ‌ని పురందేశ్వ‌రి వ్యాఖ్య‌లు ఇరు పార్టీల శ్రేణుల‌ను గంద‌ర‌గోళంలోకి నెట్టేస్తున్నాయి. కార్య‌క్ర‌మాలు వేరైనా బీజేపీ – జ‌న‌సేన పొత్తు కొన‌సాగుతుంద‌ని పురందేశ్వ‌రి పేర్కొన‌డం కొస‌మెరుపు.

Show comments