ఉత్తరాంధ్రపై నిర్లక్ష్యం చూపిందెవ‌రు? అభివృద్ధిని అడ్డుకుంటోందెవ‌రు?

ఏపీలో వెనుక‌బ‌డిన ప్రాంతం ఉత్త‌రాంధ్ర వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అభివృద్ధి బాట ప‌డుతోంది. వంద‌లాది కోట్ల‌తో నీటి ప్రాజెక్టుల‌కు కూడా బీజం ప‌డింది. గ‌తంలోని ప్రాజెక్టుల‌ను వేగ‌వంతం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టింది జ‌గ‌న్ స‌ర్కార్. అన్నింటి కంటే మించి మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న ఆ ప్రాంతానికి ఊపిరి పోసింది. ఒక్క‌సారిగా ఉత్త‌రాంధ్ర దేశ‌వ్యాప్తంగా ఉనికిని చాటుకుంది. దేశం చూపు విశాఖ‌పై ప‌డింది. దీంతో ఊహించ‌ని విధంగా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబ‌డుల‌కు ముందుకు రావ‌డం మొద‌ల‌య్యాయి. కానీ.. ఉత్త‌రాంధ్ర‌పై నిర్ల‌క్ష్యం చూపుతోందంటూ టీడీపీ, తాజాగా బీజేపీ యాత్ర‌లు ప్రారంభించ‌డం క‌రెక్టేనా అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌ను తాత్కాలికంగా విర‌మించుకోవ‌డానికి కార‌కులెవ‌రు, అక్క‌డ అభివృద్ధిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తుందెవ‌రు అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక సామాజికంగా, రాజ‌కీయంగా ఉత్త‌రాంధ్ర‌కు పెద్దపీట వేశారు. ఇక్క‌డి మూడు జిల్లాలకు బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులో కూడా ఈ ప్రాంత నాయ‌కుల‌కు అవ‌కాశాలు క‌ల్పించారు. మొత్తం ప‌ద్నాలుగు ఎమ్మెల్సీలకు ఖాళీలు ఏర్పడితే ఇందులో నాలుగు పదవులు ఈ మూడు జిల్లాలకే కేటాయించారంటే ఈ ప్రాంతంపై జ‌గ‌న్ కు ఉన్న ప్రేమ‌ను అర్థం చేసుకోవ‌చ్చు. అలాగే జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల‌ నిర్ణ‌యంతో ఉత్త‌రాంధ్ర‌లో అభివృద్ధి వేగ‌వంత‌మైంది. అన్ని ప్రాంతాల స‌మ‌గ్రాభివృద్ధిలో భాగంగా ఏపీ స‌ర్కారు అవ‌లంబిస్తున్న విధానాల‌తో స‌మప్రాధాన్యం ల‌భిస్తోంది. ఏపీలోని విప‌క్షాలు స‌ర్కారు చేస్తున్న ప‌నుల‌ను అడ్డుకుంటూ వ‌చ్చాయి. చివ‌ర‌కు మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌ను ఉప‌సంహ‌రించుకునేలా చేశాయి. అలాంటిది ఏపీ పాలకులు ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని బీజేపీ వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగానే ఉంది. రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్దిపై చిన్న చూపు చూశాయి. భూములు ఉండి కూడా ఉత్తరాంధ్ర వాసులు దేశ వ్యాప్తంగా వలసలు పోతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న నీటి ప్రాజెక్టులు విడిచిపెట్టి పోలవరం గురించే మాట్లాడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. పోలవరంపై ఉన్న శ్రద్ధ మిగిలిన ప్రాజెక్టుల పై ఉండటం లేదు. ఉత్తరాంధ్రలో అనేక నీటి ప్రాజెక్టులపై చిన్న చూపు చూస్తున్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు 7,8,9 తేదీల్లో ప్రాజెక్టుల సందర్శన చేస్తున్నామన్నారు. బీజేపీ ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేర్చింది. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్స్ కు 60 శాతం కేంద్రం నిధులు ఇస్తుంది. బియ్యంకు 36 రూపాయలు ఇస్తుంది. వాహనాలు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఖర్చు ఉత్తరాంధ్ర పై పెట్టితే 5 లక్షల ఎకరాలు పంట పండుతుందన్నారు సోము వీర్రాజు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం చేస్తుంటే దానిని వీళ్ళ సంక్షేమంగా ప్రచారం చేస్తున్నారని ఆరోప‌ణ‌లు చేశారు. ఉత్త‌రాంధ్ర‌పై అంత ప్రేమున్న ఏపీ బీజేపీ విశాఖ రాజ‌ధానిని ఎందుకు అడ్డుకుంటోంద‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

Show comments