Idream media
Idream media
దేశంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కలిసికట్టుగా మోడీ ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలపై పోరాడాలని రైతు నేత రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. అందరూ కలిసి కూటమిని ఏర్పరచుకోవాలని సూచించారు. కలిసికట్టుగా పోరాడకపోతే అందరూ మునిగిపోతారని హెచ్చరించారు. ధాన్యాన్ని కేంద్రమే సేకరించాలంటూ టీఆర్‌ఎస్ ఢిల్లీలో సోమవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు.
“ప్రభుత్వాల తరపున మీరు పోరాడితే.. రైతుల తరపున మేం పోరాడతాం. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుకు రానున్న రోజుల్లో రైతుల ఆందోళన ఉదృతం అవుతుంది. తెలంగాణలో కూడా సభను నిర్వహిస్తాం. పోరాటం చేసిన రైతులను ఆందోళనజీవి, ఖలిస్తానీ, పాకిస్తానీ అంటూ రకరకాల పేర్లతో నిందిస్తున్నారు. దేశ వ్యతిరేకులని కూడా ముద్ర వేస్తున్నారు. రైతులు బలహీనులని భావిస్తే మమ్మల్ని తక్కువ అంచనా వేసినట్లే” అని హెచ్చరించారు. రైతుల గురించి ఎవరు మాట్లాడితే వారితో చేతులు కలుపుతామని, ఇందులో రాజకీయం లేదని స్పష్టం చేశారు.
“కనీస మద్దతుధర అడిగితే వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశమని కేంద్రం తప్పించుకుంటోంది. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించే అంశంపై కమిటీ వేస్తామని, ముగ్గురి పేర్లు చెప్పాలని కేంద్రం అడిగింది. కానీ, కమిటీలో ఎంతమంది ఉంటారు!? దాని ఎజెండా ఏమిటి అని అడిగితే జవాబు రాలేదు. మా ప్రతినిధులు ముగ్గురు, ప్రభుత్వ ప్రతినిధులు ఎనిమిది మందిని కమిటీలో వేసి కనీస మద్దతు ధర అవసరంలేదని తీర్మానించే అవకాశాలు ఉన్నాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రైతాంగానికి ఇంకా సమస్యలు చుట్టుముట్టనున్నాయని, విద్యుత్తు బిల్లు వస్తే.. వ్యవసాయాన్ని వాణిజ్యంగా తీర్మానించి, మీటర్ల ద్వారా బిల్లులు కట్టాలని చెబుతారని అన్నారు. అదే జరిగితే రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. పదేళ్లు దాటిన ట్రాక్టర్లను కూడా రద్దు చేస్తామని అంటున్నారని, ఈ నిర్ణయంతోనూ రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. “గత ఏడాది రిపబ్లిక్ డే రోజున 4 లక్షల ట్రాక్టర్లు ఢిల్లీ వీధుల్లోకి వచ్చాయి. అవన్నీ పదేళ్లు దాటినవే. మా ట్రాక్టర్లు పొలాల్లోనూ పని చేస్తాయి. ఢిల్లీ రోడ్లపై కూడా దివ్యంగా నడుస్తాయి” అని అన్నారు.