మారిన జగ్గారెడ్డి స్వరం : కలిసి పనిచేస్తాం

‘‘జరిగిందేదో జరిగిపోయింది. రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత గతంలో నేను చేసిన వ్యాఖ్యలన్నీ మరచిపోయాను. ఇకపై అందరం కలిసి పనిచేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తాం’’ ఇవీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీలో చేసిన తాజా వ్యాఖ్యలు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కొద్ది కాలంగా కాంగ్రెస్‌ పార్టీపైనా, రేవంత్‌ రెడ్డిపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ఇన్‌చార్జి ఠాకూర్‌పై కూడా విమర్శల అస్త్రాలు సంధించారు. అలాగే రాజీనామా పేరుతో హైడ్రామా సృష్టించారు.

రేపో,మాపో కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్తా అంటూ పరోక్షంగా పేర్కొన్న జగ్గారెడ్డి స్వరంలో మార్పువచ్చింది. ఇకపై బహిరంగ విమర్శలు ఉండబోవని స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన కుటుంబ సమేతంగా పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ… రాజకీయాల కంటే ముందు తమ పిల్లల చదువుల గురించి రాహుల్‌ అడిగారని తెలిపారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత విద్వేషాలతో రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేలా కలసికట్టుగా పనిచేస్తామని, ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తామని తెలిపారు.పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవన్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ను కలిసి పార్టీ అంశాలపై చర్చించానన్నారు. మరోవైపు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా తన కుమారుడితో కలిసి రాహుల్‌గాంధీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేయాలని అన్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాహుల్‌ సూచించినట్లు తెలిసింది. దీంతోపాటు హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం గురించి మహేశ్‌ను రాహుల్‌ అడిగి తెలుసుకున్నారు. ఇక కాలేజీల్లో ఏబీవీపీ ప్రభావంపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కుమారుడితో ఆరా తీశారు.

Show comments