భారత్‌ ‘టీకా’ భేష్ అన్న బ్రిటన్‌ ప్రధాని

రెండురోజుల పర్యటన నిమిత్తం గురువారం తొలిసారి భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ రెండో రోజు శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ఇరు దేశాధినేతలు .. ద్వైపాక్షిక అంశాలు సహా అనేక ఇతర విషయాలపైనా.. సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.

తొలుత బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ మాట్లాడుతూ.. భారత్‌లో రూపొందించిన వ్యాక్సిన్‌(టీకా) అద్భుతమని, తాను స్వయంగా తీసుకున్నానని, కొవిడ్‌ నుంచి రక్షణ పొందానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని.. ‘నరేంద్ర’ అనడం ఎంతో ఇష్టమని పేర్కొన్న బోరిస్‌.. ‘‘నరేంద్ర నాకు ప్రత్యేక స్నేహితుడు. ఆయన నేతృత్వంలో భారత్‌ ప్రపంచ ఫార్మసీగా అవతరిస్తోంది’’ అని ప్రశంసల జల్లు కురిపించారు. భారత్‌-బ్రిటన్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాలను 100 కోట్ల మందికి పైగా ఇచ్చినట్టు తెలిపారు. విజ్ఞాన రంగంలో ఇరు దేశాలు సూపర్‌ పవర్స్‌గా ఎదిగేందుకు భాగస్వామ్య సంబంధాలను మరింత పెంపొందించుకుంటామన్నారు.

అధికార వ్యవస్థపై ఆధారపడడాన్ని, రక్షణ ఉత్పత్తుల సేకరణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా భారత్‌ కోసం బ్రిటన్‌ ఓపెన్‌ జనరల్‌ ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌(ఓజీఈఎల్‌) విధానాన్ని తీసుకురానుందని బ్రిటన్‌ ప్రధాని వెల్లడించారు. ‘‘భూమి, ఆకాశం, అంతరిక్షం, సైబర్‌ ఇలా ఏరూపంలో సవాళ్లు ఎదురైనా ఇరుదేశాలు సంయుక్తంగా,ధీటుగా ఎదుర్కొంటాయి. అత్యాధునిక ఫైటర్‌ జెట్‌ సాంకేతికతలో భారత్‌కు బ్రిటన్‌ భాగస్వామిగా వ్యవహరిస్తుంది’’ అని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. రక్షణ రంగంలో మోడీ లక్ష్యమైన ‘మేకిన్‌ ఇండియా’కు సంపూర్ణ మద్దతిస్తామని తెలిపారు.

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్‌ ఇచ్చిన ఆతిథ్యానికి అత్యంత ముగ్ధులయ్యారు. ‘‘భారత్‌ ఆతిథ్యం నన్ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. నన్ను అమితాబ్‌బచ్చన్‌, సచిన్‌ టెండూల్కర్‌లా భావిస్తున్నారు. నా ఖాసా దోస్త్‌.. నరేంద్ర సొంత రాష్ట్రంలో అమోఘమైన స్వాగతం లభించింది’’ అని బోరిస్‌ సంతోషం వ్యక్తం చేశారు. సంయుక్త మీడియా సమావేశంలో మోడీని తరచుగా తాకుతూ.. ఆయన భుజాలను స్పృశిస్తూ బోరిస్‌ ఉల్లాసంగా మాట్లాడారు.

Show comments