ముందుగా ప్రచారం చేసుకుంటే బీజేపీ టికెట్‌ కట్‌..!

తెలంగాణలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వినూత్న పంథాలో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని ముఖ్యులను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇప్ప‌టికే టీఆర్ఎస్ పాల‌న‌పై అసంతృప్తి ఉన్న ఉద్య‌మ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. స్వామిగౌడ్, రవీందర్ నాయక్, ఈటల రాజేందర్ తో సహా కొంతమంది నాయకులు అలా వచ్చినవాళ్లే. వాళ్లకు బీజేపీ రెడ్ కార్పెట్ పరిచింది. విఠల్ కూడా బీజేపీలో చేరారు. ఇలా ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీకి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు.

తాజాగా బండి సంజ‌య్ మ‌ట్లాడుతూ.. పార్టీలోకి వచ్చేందుకు చాలామంది ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తో చర్చలు పూర్తయ్యాయని, ఆయన త్వరలోనే పార్టీలోకి వస్తారని స్పష్టం చేశారు. ఇకపై కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీల చేరికలు మాత్రమే ఢిల్లీలో ఉంటాయని, మిగతావారంతా హైదరాబాద్‌ వేదికగా పార్టీ కండువా వేసుకుంటారని చెప్పారు. అంతేకాదు.. ముందస్తుగా టికెట్లు ప్రకటించే సంస్కృతి బీజేపీలో లేదని స్పష్టం చేశారు.

కొంతమంది తమకే టికెట్‌ అంటూ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటి వారి పేర్లను కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోబోమని హెచ్చరించారు. కాగా, ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడతకు సంబంధించి రూపొందించిన పాట ప్రోమోను సంజయ్‌ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ యాత్ర ద్వారా మరోసారి ప్రజల్లోకి వెళ్లి కాషాయపార్టీని మరింతగా విస్తరించే ప్లాన్‌లో ఉన్నారు. అలాగే పలు డిమాండ్లు, లేఖలను ప్రభుత్వం ముందుంచి ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.

Show comments