నాగార్జునసాగర్‌లో జల విద్యుత్తు ఉత్పత్తిని అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)ను ఆంధ్రప్రదేశ్ కోరింది. రానున్న వేసవికాలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పాదన కోసం సాగర్‌లో నీటిని ఖాళీ చేస్తూ పులిచింతలకు వదులుతోందని ఆక్షేపించింది. తక్షణమే జలవిద్యుత్తు ఉత్పాదనను నిలిపివేయాలంటూ కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయిపూరేకు ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు.
పులిచింతల పూర్తిస్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలని, ప్రస్తుతం ప్రాజెక్టులో 40.80 టీఎంసీల నీటి నిల్వ ఉందని గుర్తుచేశారు. గత వర్షాకాలంలో సాగర్‌లో తెలంగాణ జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ మాటిమాటికీ గేట్లు ఎత్తడం వల్ల పులిచింతల 16వ గేటు కొట్టుకుపోయిందని, ఇప్పటిదాకా కొత్త గేటును పెట్టలేకపోయామని గుర్తుచేశారు. సాగునీటి అవసరాల్లేనప్పటికీ సాగర్‌లో జలవిద్యుత్తు ఉత్పాదనతో పులిచింతల ప్రాజెక్టులో రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి చేరే అవకాశం ఉందన్నారు.
దాంతో గేట్లను ఎత్తి నీటిని ప్రకాశం బ్యారేజీకి వదలాల్సిన అవసరం ఏర్పడిందని, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలోనూ నీళ్లు నిండుగా ఉన్నాయని గుర్తుచేసింది. తెలంగాణ చర్యలతో ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వృధాగా విడుదల చేసే పరిస్థితి నెలకొందని నివేదించింది. రానున్న వేసవికాలంలో తాగు నీటి అవసరాలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున సాగర్‌లో జలవిద్యుత్తు ఉత్పత్తి జరగకుండా కట్టడి చేయాలని కోరింది.