వైద్యరంగం పటిష్టతకు ఏపీ సర్కారు కీల‌క నిర్ణయాలు

వైసీపీ సర్కారు మొదటి నుంచీ విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ రెండు రంగాలు సమర్ధవంతమైన సేవలు అందిస్తే చాలు పేదల ఆర్థిక పరిస్థితులు చెదిరిపోకుండా ఉంటాయని నమ్మింది. ఆ మేరకు విద్య, వైద్యం కోసం దాదాపు ప్రైవేటువైపు ఆధారపడే పరిస్థితులు లేకుండా ప్రభుత్వమే బలోపేతం చేస్తోంది. అదే దిశలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేందుకు నిన్న జరిగిన కేబినెట్‌ సమావేశంలో మరో నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ వైద్యాధికారులెవరూ ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి వీల్లేకుండా పటిష్ట నియమావళిని తయారుచేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది.

ఈ మేరకు త్వరలోనే తగిన మార్గదర్శకాలు రూపొందించనుంది. సీఎం జగన్‌ తొలి మంత్రివర్గం చివరి సమావేశం గురువారం అమరావతి సచివాలయంలో జరిగింది. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు. కొంతమంది ప్రభుత్వ వైద్యులు.. ప్రభుత్వంలో వైద్యం కంటే బయట వైద్యమే మెరుగ్గా ఉంటుందనేలా వ్యవహరిస్తున్నారని ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సిన వారు బహిరంగంగా ఆస్పత్రుల పక్కనో, దగ్గర్లో ప్రైవేటు ఆస్పత్రి ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సంతృప్తికరంగా జరగట్లేదని అభిప్రాయానికి వచ్చిన మీదట.. ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ.. ప్రైవేటు వైద్యం చేయడం సరికాదు’ అని స్పష్టం చేశారు.

అలాగే రాష్ట్రంలో హెల్త్‌ హబ్‌ల ఏర్పాటును సీరియస్‌గా తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో అత్యాధునిక ఆస్పత్రులకు భూముల కేటాయింపు, కాకినాడ సూర్యారావుపేటలో మల్టీ, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ఐదు ఎకరాలు, కర్నూలు జిల్లా కల్లూరులో ఐదు ఎకరాలు, అనంతపురం రూరల్‌లో నాలుగు ఎకరాలు, శ్రీకాకుళం మండలం పాత్రునివలసలో 4.32 ఎకరాలు, ఏపీ టూరిజం హోటల్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కోసం రాజమండ్రిలో 6 ఎకరాలు, కర్నూలు జిల్లా బేతంచర్లలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి 100 ఎకరాలు, కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుకు 15.31 ఎకరాలు, హుకుంపేట మండలం గరుకుపల్లిలో ప్రభుత్వ ఐటీఐకి 5.10 ఎకరాల కేటాయింపు వంటి నిర్ణయాలను కూడా తాజా భేటీలో తీసుకున్నారు.

Show comments