Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్లు పెంచమని అలాగే సినీ పరిశ్రమకు సంబంధించిన సుమారు 17 సమస్యలు ఉన్నాయని సినీ ప్రముఖుల బృందం కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని త్వరలో కొత్త రేట్లు జీవో వస్తుందని వెల్లడైంది.. మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో జీవో కాస్త ఆలస్యంగా విడుదలైంది. జీవో నెంబర్ 13 పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ విశ్వజిత్ కొత్త జీవో జారీ చేశారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సినీ పరిశ్రమ కోరిన అన్ని అంశాల మీద సానుకూలంగానే స్పందించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా కొన్ని కండిషన్లు కూడా పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ జీఓ నెంబర్ 13 ప్రకారం థియేటర్ ప్రాంతాలను మూడు రకాలుగా విభజించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీ -గ్రామ పంచాయతీ అనే మూడు కేటగిరీలుగా విభజించారు. వాటిలో మళ్ళీ నాన్ ఏసీ నాన్ ప్రీమియం-ప్రీమియం, ఏసీ నాన్ ప్రీమియం-ప్రీమియం, స్పెషల్ థియేటర్స్ నాన్ ప్రీమియం-ప్రీమియం, మల్టీప్లెక్స్ రెగ్యులర్ సీట్లు- రిక్లైనర్లు అంటూ విభజించారు. వీటిలో మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రారంభ ధర 40 రూపాయలు ఉండగా చివరి ధర 250 రూపాయలు. మున్సిపాలిటీలో ప్రారంభ ధర 30 రూపాయలు ఉండగా చివరి ధర 250 రూపాయలు ఉంది. నగర పంచాయతీలు- గ్రామపంచాయతీల విషయానికి వస్తే ప్రారంభ ధర 20 రూపాయలు ఉండగా చివరి ధర 250 రూపాయలు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు.
అలాగే ప్రతి థియేటర్ లో పాతికశాతం సీట్లు నాన్ ప్రీమియం కేటగిరీ కింద కచ్చితంగా ఉండాల్సిందేనని పేర్కొన్నారు. థియేటర్లలో రోజుకు ఐదు షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తూనే అందులో ఒక షో చిన్న సినిమా వేయాల్సిందేనని పేర్కొన్నారు. పండుగపూట అయినా, పెద్ద సినిమా ఉన్నా చిన్న సినిమాను ఆడించాలని, చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు ఏదో ఒక షోలో చిన్న సినిమా వేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. నటీనటులు రెమ్యూనరేషన్ తో కలిపి ఇరవై కోట్ల లోపు ఉన్న దాన్ని చిన్న సినిమాగా పరిగణించాలని పేర్కొన్నారు.
ఇక గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ప్రకారం కొన్ని హై బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. క్రియేటివిటీ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, హైడ్ అండ్ టెక్నాలజీ వాడిన హై బడ్జెట్ సినిమాలకు కచ్చితంగా భారీ బడ్జెట్ అవుతుంది కాబట్టి వాటిని స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఏ సినిమా అయితే నటీనటుల రెమ్యూనరేషన్, దర్శకుల రెమ్యూనరేషన్ కాకుండా వందకోట్ల రూపాయలు దాటుతుందో అలాంటి సినిమాను విడుదల చేసిన తర్వాత పది రోజుల పాటు సవరించిన రేట్లు ప్రభుత్వం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ విధించారు. సదరు సినిమా 20 శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో చేయాలని పేర్కొన్నారు.