12th Fail Movie Review: 12th ఫెయిల్‌ మూవీ రివ్యూ!

12th Fail Movie Review & Rating in Telugu: 12th ఫెయిల్‌ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ నవంబర్‌ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్‌ టాక్‌కు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తోంది.

12th Fail Movie Review & Rating in Telugu: 12th ఫెయిల్‌ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ నవంబర్‌ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్‌ టాక్‌కు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తోంది.

12th ఫెయిల్‌!

20231103, రియల్‌ ఇన్‌సిడెంట్‌ బేస్డ్‌ స్టోరీ, 2h 26m u
u
  • నటినటులు:విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, అన్షుమాన్ పుష్కర్, అనంత్ విజయ్ జోషి, గీతా అగర్వాల్, హరీష్ ఖన్నా, సరితా జోషి, వికాస్ దివ్యకీర్తి
  • దర్శకత్వం:విధు వినోద్ చోప్రా
  • నిర్మాత:విధు వినోద్ చోప్రా
  • సంగీతం:శంతను మోయిత్రా
  • సినిమాటోగ్రఫీ:రంగరాజన్, రామబద్రన్

Rating

3

దేవుడు చేసిన అద్భుత సృష్టిలో మనిషిది ఓ ప్రత్యేక స్థానం. దేవుడు మనిషిని సృష్టిస్తే.. ఆ మనిషి దేవుడి సృష్టికే ప్రతి సృష్టి చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే.. మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అది ఎంత గొప్ప లక్ష్యం అయినా కావచ్చు.. ఆ లక్ష్యాన్ని చేరుకోగలం అన్న నమ్మకం ఉంటే చాలు.. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని కన్నీళ్లు రాలినా.. పట్టు వదలని విక్రమార్కుడిలా.. గుడ్డి కప్పలాగా ముందుకు వెళుతూ ఉండాలి. ఏం జరిగినా నమ్మకాన్ని మాత్రం వదులు కోవద్దు.. ఆ నమ్మకమే మనం చేరాల్సిన తీరాలకు చేర్చుతుంది. మనం ఉన్న పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు.. తినడానికి తిండి లేకపోవచ్చు.. కానీ, ఏదైనా సాధించగలం అనే నమ్మకం మాత్రం ఉండాలి. ఆ నమ్మకంతోనే నిరుపేద కుటుంబానికి చెందిన వారు కూడా గొప్ప గొప్ప విజయాలను సాధిస్తున్నారు. వారి స్పూర్తిదాయక గాథలే సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. 12th ఫెయిల్‌ కూడా అలాంటి సినిమానే.. ఐపీఎస్‌ మనోజ్‌ శర్మ- ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ శ్రద్ధా శర్మల జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. నవంబర్‌ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ సూపర్‌ హిట్‌ అయింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో కూడా దుమ్మురేపుతోంది.

కథ :

మధ్య ప్రదేశ్‌లోని మోరానా కు చెందిన మనోజ్‌ కుమార్‌ శర్మ ( విక్రాంత్ మాస్సే) ఎప్పటికైనా ఐపీఎస్‌ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. అతడిది నిరుపేద కుటుంబం. ఓ పూట తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో కుటుంబం ఉంటుంది. మనోజ్‌ తండ్రి పనిలో నిజాయితీగా ఉన్నాడన్న కారణంతో సస్పెండ్‌ అవుతాడు. స్కూల్‌ చదివే సమయంలో ప్రిన్సిపాల్‌ కాపీ కొట్టమని ప్రోత్సహిస్తాడు. దీంతో ఆ ప్రిన్సిపాల్‌ను డీఎస్‌పీ దుష్యంత్‌ పట్టుకుంటాడు. జైలుకు పంపుతాడు. అందరూ నిజాయితీగా ఉండాలని చెబుతాడు. డీఎస్‌పీ దుష్యంత్‌ మాటలు మనోజ్‌పై ప్రభావం చూపుతాయి. నిజాయితీ గల ఐపీఎస్‌ అధికారి కావాలని కలలు కంటాడు. అయితే, పన్నెండవ తరగతిలో అతడు ఫెయిల్‌ అవుతాడు. అయినా పట్టువదలడు కష్టపడి చదివి ఇంటర్‌ పాస​ అవుతాడు. ఆ తర్వాత ఐపీఎస్‌ కోచింగ్‌ కోసం నగరం వెళతాడు. అక్కడ శ్రద్ధా జోషి( మేధా శంకర్‌)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ సర్వీస్‌లకు ప్రిపేర్‌ అవుతూ ఉంటారు. ఈ సమయంలో చాలా సార్లు మనోజ్‌ ఫెయిల్‌ అవుతాడు. కానీ, నమ్మకం కోల్పోడు. ఓ వైపు ప్రేమ, మరో వైపు లక్ష్యం రెండిటిని మనోజ్‌ ఎలా చేరుకున్నాడు? ఎంతటి కష్టాలను అనుభవించాడు అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ :

బయోపిక్‌లు సినిమాలుగా తెరకెక్కడం విజయం సాధించటం అన్నది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే.. తాము సాధించలేకపోయినా.. సాధించిన వాడి కథ తెలుసుకుని సంతోషిస్తుంటారు జనం. అతడు పైకి ఎదుగుతున్నపుడు.. కష్టాల్లో ఉన్నపుడు రాళ్లు వేసిన వాళ్లే విజయం సాధించిన తర్వాత చప్పట్లు కొడుతూ ఉంటారు. దర్శకుడు విధు వినోద్‌ చోప్రా..  మనోజ్‌ కుమార్‌, శ్రద్ధా జోషీల కథను అద్భుతంగా తెరపై చూపించారు. ఎక్కడా ఎమోషన్స్‌ తగ్గకుండా మొదటినుంచి చివరి వరకు కొనసాగుతుంది. స్క్రీన్‌ ప్లే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సినిమాటిక్‌ జస్టిఫికేషన్‌, ఎలివేషన్స్‌ కోసం కొన్నిటిలో ఫ్రీ హ్యాండ్‌ తీసుకున్నట్లు తెలుస్తుంది. కథ ఉత్తర భారతదేశానికి చెందినదే అయినా.. ‍ప్రపంచంలోని ప్రతీ వ్యక్తికీ కనెక్ట్‌ అవుతుంది. కనెక్ట్‌ అవ్వటమే కాదు.. కన్నీళ్లు కూడా తెప్పిస్తుంది. మనల్ని మనం తెరమీద చూసుకుంటే.. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఏడుస్తూ కూర్చోవాల్సిందే. డైలాగుల గురించి ‍ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజ జీవితంలోంచి వచ్చినవి అని ఇట్టే తెలిసిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రియల్‌ స్టోరీని రీల్‌ స్టోరీగా తెరకెక్కించటంలో విధు వినోద్‌ చోప్రా నూటికి నూరు శాతం సక్సెస్‌ అయ్యారు. కేవలం దర్శకుడిగానే కాదు.. నిర్మాతగా కూడా విధు వినోద్‌ చోప్రా సక్సెస్‌ అయ్యారు.

నటీనటుల పనితీరు :

సినిమా మొత్తం విక్రాంత్ మాస్సే వన్‌ మ్యాన్‌ ఆర్మీ షోగా నడిచింది. తెర మీద విక్రాంత్‌ను అలా చూస్తూ ఉండిపోవచ్చు. మనోజ్‌ శర్మ పాత్రలో ఆయన జీవించేశాడు. తన పాత్రకు నూటికి నూటా పది శాతం న్యాయం చేశాడు. శ్రద్ధా జోషీ పాత్రలో నటించిన మేధా శంకర్‌ యాక్టింగ్‌ ఇరగదీసింది. ఇద్దరి మధ్యా వచ్చే సీన్స్‌ కొన్ని కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇతర నటీనటులు తమ పరిధికి తగ్గట్టు చక్కగా నటించారు.

టెక్నీకల్ విభాగం :

12th ఫెయిల్‌ సినిమాకు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలెట్‌ అని చెప్పుకోవచ్చు. మూవీ మొత్తం ఎమోషన్స్‌తో నిండి ఉంటుంది కాబట్టి.. ఆ ఎమోషన్స్‌కు తగ్గట్టు మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు శంతను మోయిత్రా. ఇక, సినిమాటోగ్రాఫర్లు రంగరాజన్, రామబద్రన్ ‍ప్రతీ ఫ్రేమును అద్భుతంగా మలిచారు. మనోజ్‌, శ్రద్ధాల స్టోరీ తెరపై కనిపిస్తున్నట్లుగా కాకుండా.. మనమే నేరుగా చూస్తున్నామా అన్న భావన కలుగుతుంది. ఎడిటర్‌ జస్కున్వర్ కోహ్లీ, విధు వినోద్ చోప్రాలు ఎంత వరకు కావాలో అంతవరకు ప్రతీ షాట్‌ను, సీన్‌ను కత్తిరించి, అతికించారు. మొత్తానికి ఓ అద్భుతాన్ని తెరమీదకు తీసుకువచ్చారు.

ప్లస్‌లు :

  • కథ
  • ఎమోషనల్‌ సీన్స్‌
  • నటీ నటుల నటన
  • దర్శకత్వం, స్క్రీన్‌ ప్లే

చివరిమాట : జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనుకునే వారు తప్పకుండా చూడాల్సిన సినిమా.

రేటింగ్‌ : 3/5

Show comments