iDreamPost
iDreamPost
గత నెల వచ్చిన మూడు బ్లాక్ బస్టర్లలో ముందుగా సీతారామం అమెజాన్ ప్రైమ్ లో ఆల్రెడీ వచ్చేసింది. కేవలం 35 రోజుల నిడివితో స్ట్రీమింగ్ చేసేయడంతో వ్యూస్ మిలియన్లలో వెల్లువలా వచ్చి పడ్డాయి. కౌంట్ ఎంతనేది సహజంగా ఓటిటిలు అంత ఈజీగా బయట పెట్టవు కానీ దుల్కర్ సల్మాన్ కెరీర్లోనే హయ్యెస్ట్ రెస్పాన్స్ వచ్చి ఉంటుందని డిజిటల్ వర్గాల అంచనా. ఇప్పుడు అందరి చూపు రాబోయే కార్తికేయ 2, బింబిసారల మీదే ఉంది. నిఖిల్ మూవీని దసరా కానుకగా జీ5లో అక్టోబర్ 5న ప్రీమియర్ చేయబోతున్నారు. హిందీ వెర్షన్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడంతో ముందు అనుకున్న డేట్ కన్నా కొంత ఆలస్యంగా రిలీజ్ అవుతోందని తెలిసింది. పండక్కు మంచి గిఫ్టే.
ఇదే ప్లాట్ ఫార్మ్ బింబిసార హక్కులను సొంతం చేసుకుంది. ఇది కూడా అక్టోబర్ 7నే రావొచ్చని వినికిడి. అంటే కేవలం రెండు రోజుల గ్యాప్ అన్నమాట. పిల్లలకు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఎక్కువ చూస్తారని స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాక అంత రిజల్ట్ ఉండకపోవచ్చని ఈ ఆలోచన చేస్తున్నారట. అయినా ఇంత పెద్ద హిట్లు రెండు చేతిలో ఉన్నప్పుడు ముందస్తు ప్లానింగ్ తో కనీసం ఓ పది రోజులు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి కానీ ఇలా చేయడం ఏమిటని ప్రేక్షకుల కంప్లయింట్. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ లాంటి సంస్థలు ఇలాంటి ప్రణాళికల విషయంలో మంచి ప్లానింగ్ తో ఉంటున్నాయి. అందుకే క్లాష్ కావడం లాంటివి ఎప్పుడూ జరగలేదు.
ఓటిటి యుద్ధంలో ఇప్పుడిప్పుడే జీ5 అడుగులు వేగంగా పడుతున్నాయి. ఒకప్పుడు ఇందులో పెద్దగా చెప్పుకునే సినిమాలు ఉండేవి కాదు. ఆర్ఆర్ఆర్ నుంచి ఈ ఓటిటి స్ట్రాటజీ మార్చేసింది. హక్కుల కోసం పెట్టాల్సిన బడ్జెట్ ల విషయంలో రాజీ పడటం లేదు. అటు బాలీవుడ్ లోనూ క్రేజీ ప్రాజెక్టులను కొనేస్తోంది. ఇటు తెలుగు తమిళ కన్నడకు సంబంధించిన సూపర్ హిట్లను ఇంత కాంపిటీషన్ లోనూ పట్టేస్తోంది. కాకపోతే ప్రీమియర్ల గురించి మరింత జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఇంటర్నేషనల్ ఓటిటిలతో పోలిస్తే చందా ధర తక్కువగా ఉన్న జీ5 దాన్ని సరైన రీతిలో వాడుకుంటే సబ్స్క్రైబర్స్ ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. చూడాలి కార్తికేయ 2, బింబిసారలు ఎలాంటి స్పందన దక్కించుకుంటాయో