Idream media
Idream media
మొన్న అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ యాక్టర్ అయితే.. ప్రస్తుతం డ్యాన్సర్ అయిన అనకాపల్లి ఎమ్మెల్యే వీడియో వైరల్ గా మారుతోంది. ఇద్దరూ విశాఖజిల్లా వాసులే కావడం ఇక్కడ మరో విశేషం. నిత్యం మీటింగ్లు, సభలు, పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడూ సామాన్యుల్లా సందడి చేస్తున్నారు. కాస్త తీరిక దొరకినప్పుడు తమ అభిరుచులపై మక్కువ చూపుతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. మెగాస్టార్ పాటకు సతీమణితో స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాజకీయ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే ఆయన ఓ వివాహ కార్యక్రమంలో అద్భుతంగా డ్యాన్స్ చేశారు. చిరంజీవి నటించిన ‘కొండవీటి దొంగ’ సినిమాలోని ‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో’ అనే పాటకు కాలు కదిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తన మావయ్య కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న అమర్నాథ్ దంపతులు స్టైలిష్గా ముస్తాబయ్యారు. అనంతరం నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో ఇలా సరదాగా డ్యాన్స్ చేశారు. చిరంజీవికి తీసుపోని విధంగా స్టెప్పులు వేశావ్ అన్నా.. అంటూ ఆయన అభిమానులు కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆయన డ్యాన్స్ వేస్తున్న వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు.
అంతకు ముందు మంత్రి కూడా..
కాగా ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఇలాగే హుషారుగా డ్యాన్స్ చేశారు. హైదరాబాద్ వేదికగా జరిగిన తన కూతురు పెళ్లిలో నితిన్ ‘సై ‘ సినిమాలోని ‘నల్ల నల్లాని కళ్ల’ పాటకు ఉత్సాహంగా కాలు కదిపారు. ఈ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా సాగకపోతే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసే ప్రజా ప్రతినిధులు.. ఇలా అప్పుడప్పుడు సామాన్య ప్రజలతో సమానంగా వేడుకల్లో పాల్గొనడం ఆకట్టుకుంటోంది.
Also Read : ఇదేందయ్య.. హైకోర్టుకు ఆనందయ్య..!