Idream media
Idream media
ఎన్నిక ఏదైనా అధికార పార్టీ వైసీపీదే హవా అని ఏపీ వరుస ఎన్నికలు తెలియజేస్తున్నాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కూడా అదే నిరూపిస్తుందా..? అంటే అవుననే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. విపక్షాల ఆశలు గల్లంతు అయ్యేలా ఫలితాల సరళి ఉంది. భారీ ఆధిక్యం దిశగా వైఎస్సార్‌సీపీ ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెల్లడైన ఫలితాల్లో తొలిరౌండ్‌లో 32,397 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో కౌంటింగ్ కొనసాగుతోంది.
పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన పనబాక..
తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్‌లో తిరుమలలో వైసీపీ భారీ ఆధిక్యతలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా తెలిపారు. సుమారు రెండు వేల పైచిలుకు వైసీపీ మెజారిటీలో ఉంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట ఉన్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అనుచరులు, నేతలు, వైసీపీ కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ ఆధిక్యతపై తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఏజెంట్లు లేకుండా వన్‌సైడ్‌గా పోలింగ్ జరిగిందని విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఎన్నికల రోజు ఎన్నికల ఏజెంట్ తనను కూడా స్వయంగా తిరుమలకు పంపలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రతీ ఓటూ వైసీపీకే పడిందని లెక్కింపులో తేలడంతో నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read : మమత వెనుకంజ.. పార్టీ ముందంజ
తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి నాలుగవ రౌండ్ పూర్తి అయ్యే సరికి వైసీపీ అభ్యర్థి ముద్దిళ్ల గురుమూర్తి ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 31511ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 17520 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 2191 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి 13,991 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అంతకు ముందు వెల్లడైన రెండు, మూడు రౌండ్ల లో కూడా వైసీపీ అభ్యర్థే ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి వైసీపీ అభ్యర్థి మద్దిళ్ల గురుమూర్తికి 11788ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 5557 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కె.రత్నప్రభకు 771 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి వైసీపీ అభ్యర్థి మద్దిళ్ల గురుమూర్తికి 20472ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 9605 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కె.రత్నప్రభకు 1364 ఓట్లు వచ్చాయి. ఇలా మొత్తంగా నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి భారీ ఆధిక్యంలో ముందంజలో కొనసాగుతున్నారు.
పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉండగా, తిరుపతిలో 13 రౌండ్లు, శ్రీకాళహస్తిలో 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్‌లో నే వైఎస్సార్‌సీపీ ఆధిక్యత సాధించి ఇక తనకు తిరుగులేదన్న సంకేతాలు ఇచ్చింది. తొలి రౌండ్ ముగిసేసరికి మళ్లీ అదే నిరూపితమైంది.
Also Read : నాగార్జున సాగర్ బై పోల్ : దూసుకెళ్తున్న కార్