సంగీత దర్శకుల మీద అడపాదడపా ప్రేరణ.. తస్కరణ ఆరోపణలను వస్తూనే ఉంటాయి. అయితే పాటల రచయితల మీద ఇలాంటి అపవాదులు రావడం సాధారణంగా జరగదు. అదీ సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి తెలుగు పండితుడు.. పాటల తాంత్రికుడిపైన రావడం ఊహకు అందని విషయం. ఈతరంలో ఎక్కువమందికి ఈ విషయం గురించి తెలిసే అవకాశం ఉండదు. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈమధ్య సిరివెన్నెలపై వచ్చిన ఇలాంటి అపవాదు.. దాని వెనక నిజానికి ఏం జరిగింది అన్నది తన యూట్యూబ్ ఛానెల్ లో ఎంతో ఆసక్తికరంగా వివరించారు.
సిరివెన్నెల పాటల రచయితగా కెరీర్ ఆరంభించిన రోజుల్లోనే యండమూరికి మంచి సాన్నిహిత్యం ఉండేదట. ఆ సమయంలో యండమూరి ‘ఆనందో బ్రహ్మ’ నవల రాస్తున్నారట. అయితే పోతన గారికి ‘అల వైకుంఠపురంబులో’ పద్యం సమయంలో వచ్చిన రైటర్స్ బ్లాక్ లాంటిదే యండమూరికీ వచ్చిందట. పెన్ను ఎంతకీ ముందుకు కదలకపోయే సరికి పక్కనే ఉన్న సిరివెన్నెలను “శాస్త్రీ ఈ పారాగ్రాఫ్ కొంచెం రాసిపెట్టవయ్యా” అని అడిగారట. ఆయన వెంటనే “జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది” అంటూ చకచకా రాసి ఇచ్చారట.
అయితే తను రాసిన ఆ పదాలనే ‘చక్రం’ సినిమాలో ఓ పాటకు పల్లవిగా శాస్త్రిగారు వాడుకున్నారట. ఆ పాట కూడా సూపర్ హిట్ అయింది. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకపోవడంతో సిరివెన్నెల గారు యండమూరి నవల ‘ఆనందో బ్రహ్మ’ లోని పదాలను కాపీ కొట్టారని ఓ అపప్రద వచ్చిందట. ఈ విషయం తెలిపిన యండమూరి ఆ తప్పు తనదేనని అన్నారు. “ఆ వాక్యాలు తను రాసినవే అని నేను చెప్పి ఉండొచ్చు. కానీ నవలలో ఎలా రాస్తాం. ఏదో అలా వచ్చాడు.. ఓ పారాగ్రాఫ్ రాసి అలా వెళ్ళిపోయాడు. ఆ రోజు సరస్వతి దేవి వచ్చి పోతనకు హెల్ప్ చేసినట్టు చేశాడు. ఫలానా సెంటెన్సులు ఫలానావాళ్ళు రాశారని మనం నవలలో రాయలేం కదా? ఈ రకంగా సీతారామ శాస్త్రి చేత తిట్లు తిన్నా” అంటూ నవ్వుతూ ముగించారు.