iDreamPost
iDreamPost
రాజకీయం, సినీ రంగం రెండు కవల పిల్లల్లాంటివి.. రెండింటికీ పబ్లిసిటీ అవసరం. ప్రచారం లేకపోతే సినిమా హిట్టవ్వదు.. ఎన్నికల్లో లీడర్లు గెలవలేరు.. అప్పుడప్పుడు పొలిటికల్ సినిమాలు వస్తాయ్. పాలిటిక్స్ లోకి సినిమాలు వస్తాయ్. రెండు మిక్స్ అయిపోతాయ్. అయితే సినిమాల్లో హీరోలుగా ఉండి.. పాలిటిక్స్ లోనూ ‘హీరో’లయ్యేటోళ్లు తక్కువగా కనిపిస్తుంటారు. జీరోలయ్యేటోళ్లు తరచూ కనిస్తుంటారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లోనూ పొలిటికల్ సినిమా నడుస్తోంది. మరి యాక్టర్ కమ్ పొలిటీషిన్లు నెగ్గుకొస్తారా? రాజకీయ చలనచిత్రం హిట్ అవుతుందా?
తమిళనాడులో పాలిటిక్స్, సినిమా.. వేర్వేరుగా కనిపించవు.
ఎప్పుడూ ఒకదానిలో ఇంకోదాని జోక్యం ఉంటుంది. ఇది ఇప్పుడు మొదలైంది కాదు.. అన్నాదురై కాలం నుంచే ఉంది. ఆయన పార్టీ డీఎంకేలో ఉన్న కరుణానిధి, ఎంజీ రామచంద్రన్ ఇద్దరూ సినీరంగానికి చెందిన వాళ్లే. తర్వాతి కాలంలో ముఖ్యమంత్రులయ్యారు. రామచంద్రన్ తర్వాత ఆయన వారసురాలిగా వచ్చిన సినీ నటి జయలలిత కూడా సీఎం అయ్యారు. తమిళనాడు చరిత్రలో కరుణానిధి, జయలలిత ఇద్దరూ లేకుండా తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి.
కమల్.. కూటమిగా బరిలోకి
లోకనాయకుడు కమల్ హాసన్ కాస్త ఆలస్యంగా పాలిటిక్స్ లోకి వచ్చారు. 2018 ఫిబ్రవరి 21న మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి ఆయన పార్టీ పోటీ చేసింది. కానీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. కేవలం 3.7 శాతం సీట్లు సాధించింది. పోటీ చేసిన ఏ ఒక్క సీటులోనూ డిపాజిట్లు సాధించలేదు. చాలా చోట్ల మూడో స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో కమల్ పోటీ చేయలేదు. తాజా ఎన్నికల్లో కూటమి ఏర్పాటు చేసిన కమల్ హాసన్.. తానే సీఎం అభ్యర్థినని ప్రకటించుకున్నారు. కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనతో మరో నటుడు శరత్‌కుమార్ పార్టీ ‘ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి’, ‘భారత జననాయగ కట్చి’ పార్టీలు కలిశాయి. ఇక ఎంఎన్ఎం 150కి పైగా స్థానాల్లో పోటీ చేస్తోంది. తమ పార్టీ సింబల్ అయిన టార్చిలైట్ పట్టుకుని కమల్, ఆయన పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
వెనుకబడిన కెప్టెన్
16 ఏళ్ల కిందట పాలిటిక్స్ లోకి వచ్చారు కెప్టెన్ విజయ్ కాంత్. 2005 సెప్టెంబర్ 14న డీఎండీకేను స్థాపించారు. తర్వాత 2006 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 సీట్లలోనూ పోటీ చేసి 10 శాతం ఓట్లు సాధించారు. ఒకే ఒక్క సీటులో ఆయన పార్టీ గెలిచినా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఆశలు రేపింది. కానీ 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చతికిలపడింది. 39 సీట్లలో పోటీ చేసి ఏ ఒక్కటీ గెలవలేదు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసి.. 29 సీట్లు సాధించింది. అయితే జయలలిత హవాలోనే అన్ని సీట్లు వచ్చాయి. జయతో విభేదించి 2016 ఎన్నికలకు వెళ్లిన విజయ్ కాంత్.. ఒక్క సీటూ గెలవలేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ సున్నాతోనే సరిపెట్టుకున్నారు. ఇక తాజా ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నుంచి బయటికి వచ్చి.. ఏఎంఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 60 సీట్లలో పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో విజయకాంత్ పోటీ చేయడం లేదు. ఆయన భార్య ప్రేమలత.. విరుదాచలం నుంచి బరిలో ఉన్నారు. తొలి నుంచి విజయ్ కాంత్ పార్టీకి ఓట్లు బాగానే వస్తున్నా.. సీట్లు రావట్లేదు. ఈ సారైనా ఆ కొరత తీరుతుందేమో చూడాలి.
Also Read : పరిషత్ ఎన్నికల బహిష్కరణ: జయలలితతో చంద్రబాబు పోలికలో ఏమైనా అర్థముందా..?
శరత్ కుమార్.. అంతా గందరగోళం..
కమల్, విజయ్ కాంత్ కంటే ముందే పాలిటిక్స్ లోకి వచ్చార్ శరత్ కుమార్. కానీ ఆయన రాజకీయ ప్రయాణమంతా గందరగోళంగానే సాగింది. 1994 వరకు మాజీ సీఎం జయలలితకు దగ్గరి వ్యక్తిగా శరత్ కుమార్ ఉండేవారు. కానీ ఓ సినిమా విషయంలో మొదలైన వివాదం వల్ల ఇద్దరికీ ఒకరి మీద ఇంకొకరికి కోపం పెరిగింది. దీంతో ఆయన 1996లో డీఎంకేలో చేరి.. 1998లో తిరునెల్వేలి సీటు నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. తర్వాత 2001లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2006లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంపీ పదవికి రాజీనామా చేసి.. అన్నాడీఎంకేలో చేరారు. తర్వాత అక్కడ పొసగక.. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీని 2007లో ఏర్పాటు చేశారు. 2011లో మళ్లీ అన్నాడీఎంకే కూటమిలో చేరారు. ఆయన పార్టీ రెండు సీట్లలో పోటీ చేసి గెలిచింది. 2016లో తిరుచెందురు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా కమల్ హాసన్ పార్టీతో జతకట్టారు. సుమారు 40 సీట్లలో పోటీ చేస్తున్నారు.
కుష్బూ.. డీఎంకే టు బీజేపీ వయా కాంగ్రెస్
కుష్బూ 2010 మే నెలలో డీఎంకేలో చేరారు. 2014లో ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరారు. అటునుంచి బీజేపీలోకి 2020 అక్టోబర్ లో వచ్చారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఆమె సీటులో జాతీయ స్థాయి బీజేపీ నేతలు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. తన గెలుపు పక్కా అని ఆమె ధీమాగా ఉన్నారు.
ఇక డీఎంకే చీఫ్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్. ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు. తన తాత కరుణానిధి నియోజకవర్గమైన చెపాక్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. పదునునైన విమర్శలు చేస్తున్నారు.
కమల్ హాసన్ తో 13 ఏళ్లు రిలేషన్ లో ఉండి తర్వాత విడిపోయిన నటి గౌతమి.. బీజేపీ తరఫున పని చేస్తున్నారు. పోటీలో నిలవకున్నా.. ప్రచారం మాత్రం చేస్తున్నారు. ఇక సీపీఎం తరఫున సీనియర్ నటి రోహిణి, డైరెక్టర్ లెనిన్ భారత్ ప్రచారం చేస్తున్నారు.
రజనీ సినిమా.. రిలీజ్ కాకముందే అట్టర్ ఫ్లాప్
రాజకీయాల్లోకి వస్తున్నా.. అంటూ ఎన్నో ఏళ్లపాటు అభిమానులను ఊరించి ఉసూరుమనిపించారు రజనీకాంత్. చివరికి రావడం లేదని ప్రకటించి బాంబు పేల్చారు. అనారోగ్య కారణాల వల్ల పాలిటిక్స్ లోకి రావడం లేదని, తానిచ్చిన మాటను వెనక్కి తీసుకుంటున్నానని, అందుకు తనను క్షమించాలని అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుసత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్లు చెప్పారు. లక్షలాది మంది అభిమానులను నిరాశపరిచారు. తన సూపర్ హిట్ సినిమాలతో కోట్లు కొల్లగొట్టి, థియేట్లర్లను హౌస్ ఫుల్ చేశారు రజనీకాంత్. కానీ ఆయన పొలిటికల్ సినిమా మాత్రం రిలీజ్ కాకముందే అట్టర్ ఫ్లాప్ అయింది.
Also Read : తమిళనేతలను తలదన్నేలా చింతామోహన్ హామీలు