iDreamPost
iDreamPost
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించినట్లే ఫలితాలు కూడా ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం మొదలైంది. తొలి ఫలితాల సరళి ఉత్కంఠ రేపుతోంది. తొలి రౌండ్ లెక్కింపులో టీఎంసీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ.. ఆ పార్టీ సారధి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెనుకంజలో ఉండటం విశేషం. రాష్ట్రంలో 294 సీట్లకు గాను 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 10.30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం టీఎంసీ 191, బీజేపీ 96 చోట్ల ఆధుక్యత సాధించాయి. కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి సంయుక్త మోర్చా కేవలం 5 చోట్లే ఆధిక్యంలో ఉన్నాయి.
నందిగ్రామ్ లో ఉత్కంఠ
బెంగాల్ ఎన్నికల్లో అత్యంత హాట్ సీటుగా యావత్తు దేశం దృష్టిని తన వైపు తిప్పుకున్న నియోజకవర్గం..నందిగ్రామ్. సాక్షాత్తు ముఖ్యమంత్రి మమత .. తన మాజీ సహచరుడు, బీజీపీ అభ్యర్థి సువేందు అధికారిని అతని సొంత కోటలోనే సవాల్ చేశారు. తొలి దశలోనే పోలింగ్ పూర్తి చేసుకున్న ఈ నియోజకవర్గంలో మమత సర్వశక్తులు ఒడ్డి.. దాదాపు ఒంటరిగా సువేందు నేతృత్వంలోని కాషాయ సైన్యాన్ని ఢీకొట్టారు. అయితే ఇక్కడ ఫలితం ఆమెకు నిరాశాజనకంగా కనిపిస్తోంది. తొలుత ఇద్దరి మధ్య ఊగిసలాడిన ఆధిక్యత రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి సువేందు వైపే మొగ్గింది. తొలి రౌండులో 1497 ఓట్లు వెనుకంజలో ఉన్న మమత రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి 4557, మూడో రౌండ్ తర్వాత 7200 ఓట్ల తేడాతో వెనుకంజలో కొనసాగుతున్నారు.
భారీ బందోబస్తు మధ్య లెక్కింపు
బెంగాల్లో ఉదయం ఏడు గంటలకు లెక్కింపు మొదలైంది. 292 నియోజకవర్గాలకు 108 కౌంటింగ్ కేంద్రాలు, 1113 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా 256 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రంలో మోహరించారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read : తమిళనాట పొద్దు పొడుస్తోంది.. డీఎంకే ఆధిక్యంతో స్టాలిన్ కల నెరవేరబోతోంది..