iDreamPost
iDreamPost
పశ్చిమ బెంగాల్ రెండోదశ పోలింగ్ కు సిద్ధమైంది. మొత్తం 30 నియోజకవర్గాల్లో గురువారం ఎన్నికలు జరగనుండగా.. హోరాహోరీగా జరిగిన ప్రచారం మంగళవారం సాయంత్రమే ముగిసింది. రెండోదశలో అత్యంత కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రమంతా ఒక ఎత్తు.. ఈ ఒక్క నియోజకవర్గం ఒక ఎత్తు అన్నంత ఉత్కంఠ రేపింది. ఈ ప్రాంతంలో మకుటం లేని మహారాజులా చెలామణీ అవుతున్న బీజేపీ అభ్యర్థి సువెందు అధికారిని అతని కోటలోనే ఒడిస్తానని సవాల్ చేసి మరీ సీఎం మమతా బెనర్జీ ఇక్కడి నుంచి పోటీకి దిగడంతోనే ఈ నియోజకవర్గం మొత్తం దేశం దృష్టిని తనవైపు తిప్పుకుంది.
నందిగ్రామ్ తోనే తృణమూల్ కు వెలుగు
నందిగ్రామ్ ఈ ఎన్నికకు ముందే భూపోరాటంతో వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల క్రితం ఇక్కడ టాటా మోటార్స్ ఫేక్టరీ పెట్టేందుకు అప్పటి వామపక్ష ప్రభుత్వం భూసేకరణ తలపెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ ఉద్యమానికి అప్పుడే కొత్తగా ఏర్పడిన తృణమూల్ కాంగ్రెస్ బాసటగా నిలిచి మంచి ప్రాచుర్యం పొందింది. నానాటికి తీవ్రమవుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం.. ఆ నేపథ్యంలో జరిగిన పోలీసు కాల్పుల్లో పలువురు మరణించడంతో టాటా మోటార్స్ అక్కడ ప్లాంట్ ఏర్పాటు ఆలోచనను విరమించుకుంది.
ఆనాటి భూ పోరాటంలో అదే ప్రాంతానికి చెందిన సువెందు అధికారి కుటుంబం తృణమూల్ తరపున పోరాటం నడిపి పార్టీతో సమానంగా పేరు ప్రఖ్యాతులు పొందింది. నందిగ్రామ్ ఉన్న తూర్పు మిడ్నాపూర్ తోపాటు పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లోని 25 నుంచి 30 నియోజకవర్గాల్లో అధికారి కుటుంబానికి మంచి పేరుంది. ఆ కుటుంబ సభ్యులు లేదా వారు సూచించిన వారే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికవడం ఆనవాయితీగా వస్తోంది. వారి నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. మమత మంత్రివర్గంలో మంత్రిగా ఇటీవలి వరకు పని చేసిన సువేందు అధికారి.. ట్రబుల్ షూటర్ గా పార్టీ వ్యవహారాల్లోనూ కీలకంగా పనిచేశారు.
Also Read : బీజేపీకి జనసేన సహకరిస్తోందా.. లేదా..?
బీజేపీలోకి అధికారి కుటుంబం
పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న కమలదళం 2019 ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో 18 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఉత్సాహంతో తృణమూల్ పార్టీని, సర్కారును టార్గెట్ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా మిడ్నాపూర్ జిల్లాల్లో అపరిమితమైన పట్టున్న అధికారి కుటుంబాన్ని పార్టీలోకి తీసుకొని మమతను సవాల్ చేసింది. తాను ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన సువేందు అధికారి నమ్మక ద్రోహం చేశారని ఆగ్రహించిన దీదీ.. అధికారి కుటుంబంపై రాజకీయ యుద్ధం ప్రకటించారు. బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్ లొనే ఆయనపై పోటీ చేసి ఒడిస్తానని సవాల్ చేశారు. తన సవాల్ కు కట్టుబడి పెట్టని కోటలాంటి రాఘవపూర్ నియోజకవర్గాన్ని వదిలి నందిగ్రామ్ లో పోటీకి సై అన్నారు.
హోరాహోరీగా పోరు
తన ప్రతిష్టను ఫణంగా పెట్టి.. తన వద్ద మంత్రిగా పనిచేసిన సువేందు అధికారిపై మమత పోటీకి దిగడంతో నందిగ్రామ్ మహా సంగ్రామ క్షేత్రంగా మారింది. అటు తృణమూల్ ఇటు బీజేపీ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి. నామినేషన్ల ఘట్టంలోనే తనపై బీజేపీ గుండాలు దాడి చేశారని మమత ఆరోపించడం.. ఆమె కాలికి గాయం కావడం.. నాలుగు రోజులు ప్రచారానికి దూరంగా ఆస్పత్రిలో ఉండటం, తర్వాత కూడా వీల్ చైర్లోనే ప్రచారం చేయడం తీవ్ర కలకలం, దుమారం రేపాయి. నందిగ్రామ్ లో ముగింపు ప్రచారాన్ని కూడా మమతా కాలికట్టుతోనే నిర్వహించారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్వరం.. బీజేపీ భిన్నరాగం