iDreamPost
iDreamPost
సినిమా హాలుకు ఎందుకు వెళతాం. కుటుంబ సభ్యులతో కలిసి పెద్దతెరపై ఎంటర్ టైన్మెంట్ ని అందుకుని ఇష్టమైన తారలను చూస్తూ ఎంజాయ్ చేయడానికి. అలాంటిది అక్కడ ప్రాణాలు కోల్పోవడం ఎవరైనా ఊహిస్తారా. బాలీవుడ్ లోనే అత్యంత చీకటి జ్ఞాపకంగా చెప్పుకునే ఈ దారుణం పాతికేళ్ల క్రితం జరిగింది. 1997 ఢిల్లీ నడిబొడ్డునుండే ఉపహార్ థియేటర్లో బోర్డర్ ఆడుతోంది. అప్పటి టాప్ స్టార్స్ జాకీ శ్రోఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సన్నీ డియోల్ తదితరులు నటించిన మల్టీ స్టారర్ అది. భారీ వసూళ్లతో సంచలనం రేకెత్తించింది. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం మూడు గంటల అట హౌస్ ఫుల్ జనాలతో షో రన్ అవుతోంది. అప్పుడు జరిగిందా దుర్ఘటన.
ఆ రోజు ఉదయం ఉపహార్ విద్యుత్ మరమత్తు పనుల్లో జరిగిన నిర్లక్ష్యం కారణంగా షార్ట్ సర్క్యూట్ తలెత్తి మెల్లగా థియేటర్ లోపలికి మంటలు వ్యాపించాయి. అంతే ఒక్కసారిగా ఆడియన్స్ కేకలు పెట్టుకుంటూ బయటికి పరిగెత్తడంతో లోపలే ఎందరో ఇరుక్కుపోయారు. బయటికి వెళ్లే మార్గాలు ఎక్కువ లేక సీట్లలోనే మంటలకు ఆహుతయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోగా 59 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. 100కి పైగా తీవ్ర గాయాలతో సంవత్సరాల తరబడి నరకం చూశారు. ఉపహార్ యజమానులు అన్సల్ బ్రదర్స్ పోలీసులు అరెస్ట్ చేశాక బాధితులు న్యాయ పోరాటం కోసం ఇరవై ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది
ఇంతా జరిగి చివరికి నష్టపరిహారం అరవై కోట్ల దాకా చెల్లించాలని తీర్పు వచ్చినప్పటికీ అప్పటికే బోలెడు ఆలస్యం జరిగిపోయింది. వ్యవస్థలోని లోపాలను వాడుకుంటూ పలుకుబడి చూపించి అన్సల్ సోదరులు వేసిన ఎత్తుగడలు ఎందరికో నరకాన్ని మిగిల్చాయి. వాళ్ళు జైలు శిక్ష అనుభవించినప్పటికీ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలకు సంబందించిన క్షోభ ఎవరూ తీర్చలేనిది. ఈ ఘటనని ఆధారంగా చేసుకుని జనవరి 13న నెట్ ఫ్లిక్స్ లో ట్రయిల్ బై ఫైర్ అనే సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కాబోతోంది. అప్పుడు జరిగిన సంఘటనల క్రమాన్ని కళ్ళకు కట్టినట్టు ఇందులో చూపించబోతున్నారు. అభయ్ డియోల్, అనుపమ్ ఖేర్, ఆశిష్ విద్యార్ధి ముఖ్య తారాగణం