వరంగల్ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రీతి మరణం రాష్ట్రంలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సీనియర్ స్టూడెండ్ ర్యాగింగ్ చేయడంతో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనను ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు ప్రజలు. ఇలాంటి సమయంలో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి సంబంధించిన మరో వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసింది అన్న వార్త తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఆ మెడికో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
వరంగల్ కేఎంసీ కాలేజీలో పీడియాట్రిక్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతోంది విద్యార్థిని లాస్య. ఉన్నట్లుండి లాస్య అస్వస్థతకు గురికావడంతో.. ఆత్మహత్యా యత్నం చేసిందని వార్తలు వినిపించాయి. కానీ కాలేజీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. లాస్యకు మైగ్రేన్ తల నొప్పి ఉందని, దాంతో కాస్త తల నొప్పిగా అనిపించడంతో.. మెటాప్రోనాల్ మాత్రలు వేసుకుంది. కానీ మైగ్రేన్ తగ్గకపోవడంతో.. మరో టాబ్లెట్ వేసుకుంది. దాంతో అది ఓవర్ డోస్ కావడంతో.. అస్వస్థతకు గురైంది. దాంతో లాస్యను వెంటనే ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక ఈ విషయం బయటకి తెలియడంతో.. అందరు అది ఆత్మహత్యా యత్నం అని చిత్రీకరిస్తున్నట్లుగా కాలేజీ యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం మెడికో లాస్య ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎంజీఎం సూపరిడెంట్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. లాస్య తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని వారు తెలిపారు. కాగా లాస్య కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. తాను సూసైడ్ అటెంప్ట్ చేయలేదని, మైగ్రేన్ మాత్రలు మాత్రమే వేసుకున్నానని, ఓవర్ డోస్ కావడంతోనే ఇలా అస్వస్థతకు గురైయ్యానని చెప్పుకొచ్చింది. దాంతో కేఎంసీ యాజమాన్యం, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.