Krishna Kowshik
Krishna Kowshik
మొన్నటి వరకు ఎండా కాలంలో సూర్యుడి భగభగలతో మంటెక్కిపోయిన జనాలు.. వర్షాలు పడుతుండటంతో కాస్త స్వాంతన చెందారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇక్కట్లు పడ్డారు ప్రజలు. దీంతో ఎండాకాలమే బెటర్ అని భావిస్తున్నారు. వరుసగా వానలు పడుతుండటంతో అటు ఆఫీసులకు, ఇతర వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లలేకపోతున్నారు. హైదరాబాద్ వంటి మహా నగరంలో చిన్నపాటి వర్షాలకు రోడ్లన్నీ నీటమునిగాయి. మోకాళ్ల లోతులో నీరు చేరడంతో ఇబ్బంది పడుతూనే తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో సీజనల్ వ్యాధులు ప్రభావితం చూపాయి. కండ్ల కలక కరోనా వ్యాధి మాదిరి విస్తరించింది. చాలా మంది దీని బారిన పడ్డారు. కంటి ఆసుపత్రులకు పరుగులు పెట్టడంతో.. ఆ హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడాయి. ఇక ఇప్పుడు తగ్గుముఖం పడుతుందీ అనుకుంటున్న సమయంలో వైరల్ ఫ్లూ వణికిస్తోంది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారడంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు అంటూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ప్రజలు. వరద నీరు నిల్వ ఉండిపోవడంతో అందులోనే రాకపోకలు సాగించడంతో పలువురు ఫీవర్ బారిన పడుతున్నారు. దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. జ్వరం, జలుబు, మంటలు, దగ్గుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. అప్పటికప్పుడే జ్వరం వచ్చేయడంతో పాటు ఇంట్లో మెడిసన్ తీసుకుంటే తగ్గడం లేదు. కొంత మంది కరోనా అని పరీక్షలు చేయించుకుంటారు. మరి కొంత మంది ఆసుపత్రులకు వెళుతుంటే వైరల్ ఫీవర్ అని నిర్ధారణ అవుతుంది. వైరల్ ఫీవర్‌తో ఆసుపత్రులకు చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.
ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిమ్స్ ఆసుపత్రుల్లో వైరల్ ఫీవర్‌తో రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఒక్కో ఆసుపత్రిలో సుమారు 500 నుండి వెయ్యి వరకు ఓపీ పెషేంట్లు వస్తున్నారని వినికిడి. అలాగే ఆసుపత్రుల్లో చేరుతున్న సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి తగ్గ కోర్సు మెడిసన్ వాడితేనే వైరల్ ఫీవర్ కంట్రోల్ అవుతుంది. వీటికి తోడు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. దీంతో భాగ్యనగర వాసులు భయాందోళన చెందుతున్నారు. అయితే భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యులను సంప్రదించి మెడిసన్ తీసుకుంటే తగ్గిపోతుందని చెబుతున్నారు. చిన్న పిల్లలు జ్వరం, వాంతులు, ఇతర లక్షణాలతో బాధపడుతుంటే మాత్రం అశ్రద్ధ వద్దని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.