పొలిటికల్‌ పంచాంగం @ ఏపీ

ఉగాది వస్తోందంటే.. పచ్చడి ఎంతలా గుర్తుంటుందో.. పంచాంగం కూడా జ్ఞప్తికి వస్తుంది. తెలుగు సంవత్సరాదిలో ఎవరి జాతకాలు ఏంటి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం, అవమానం..ఇలా వీటి చుట్టూనే చాలామంది ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మిగతా వారి సంగతి ఎలాగున్నా రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జరిగే పంచాంగ శ్రవణాలు ఆసక్తిగా ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే.. ఏ పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరుగుతుందో.. ఆ పార్టీదే భవిష్యత్‌ అన్నట్లుగా కొందరు పంచాంగకర్తలు చెబుతుంటారు.

పంచాంగకర్తల మాట అటుంచి.. ఏపీలో ఏ పార్టీ రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉండనుందో ఓసారి పరిశీలిస్తే.. ప్రస్తుతానికి అధికారపార్టీ వైసీపీ మంచి దూకుడు మీదుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఆ పార్టీ ప్రతిష్ఠను అమాంతం పెంచేస్తున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులను లెక్క చేయకుండా జగన్‌ ప్రజాశ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాలను చకచకా తీసుకుంటున్నారు.

నిన్నటికి నిన్న తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో ఒకేసారి ఐదొందల వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. కాన్పు కోసం మహిళ 108కు ఫోన్‌ చేస్తే చాలు.. ఏసీ వాహనం ఇంటికొచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తుంది. ఖరీదైన మందులను అందిస్తారు. సాధారణ కాన్పు అయితే రూ. మూడు వేలు, సిజేరియన్‌ అయితే రూ. ఐదు వేలు చెల్లెమ్మల చేతిలో పెట్టి మళ్లీ ఏసీ వాహనంలో ఇంటి వద్ద దింపుతారు. ఇది మచ్చుకు ఓ ఉదాహరణ మాత్రమే.. చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటి సరికొత్త పథకాలు వైసీపీ సర్కారు చాలానే కొనసాగిస్తోంది. ఇంకా ప్రవేశపెడుతూనే ఉంది. మరి జగన్‌ అలాంటి కార్యక్రమాలు చేస్తుంటే.. వైసీపీ భవిష్యత్‌కు వచ్చిన బెంగేముంటుంది. మరింత ప్రజాదరణ పొందడం ఖాయం.

ఇక ప్రతిపక్ష పార్టీ టీడీపీ బలం ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా తగ్గుతోంది. అధినేత చంద్రబాబు తీరు కార్యకర్తలను, నాయకులను కూడా ఆందోళనలో పడేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరించడం బాబుకు అలవాటే. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాదు.. లేనప్పుడు కూడా తనయుడు లోకేష్‌ కు ప్రాధాన్యత పెంచి ఆయన స్థానాన్ని సుస్థిరం చేయడంపైనే ఆయన దృష్టి సారిస్తున్నారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. రాజపూజ్యుల సంగతి అటుంచితే.. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లాంటి వారే.. పార్టీని అవమానించేలా మట్లాడుతున్నారు. దీంతో బాబు జనసేనతో దోస్తీకి ఉవ్విళ్లూరుతున్నారు. జనసేనేమో ఇప్పటికే బీజేపీతో దోస్తానా చేస్తోంది. బీజేపీ ఏమో టీడీపీకి దూరం దూరం అంటోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల పొత్తుల లెక్క ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు మాత్రమే సమయం ఉండడంతో ఈ కొత్త సంవత్సరాధిలో ఆ లెక్క తేలిపోనుంది.

ఆ సంగతి అటుంచితే.. ఒకప్పుడు ఢిల్లీలో సైతం చక్రం తిప్పగలిగే సత్తా కలిగిన నేతగా పేరు పొందిన చంద్రబాబు.. ఇప్పుడు గల్లీలో తన కుర్చీ కాపాడుకోవడానికి కుస్తీలు పడుతున్నారు. కుప్పంలో తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఫార్టీ ఇయర్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే నేతకు ఏడుసార్లు గెలిచిన చోట కూడా ఎదురీత తప్పేలాలేదు. ఆ లెక్కన రాష్ట్రంలో నిలదొక్కుకునేందుకు ఈ వయసులో బాబుకు పడరాని పాట్లు తప్పవని తెలుస్తోంది. ఈ క్రమంలో కన్నీళ్ల శపథాలు మరిన్ని వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎన్ని చేసినా టీడీపీ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలైతే కనిపించడం లేదు.

ప్రశ్నించడం కోసం రాజకీయ తెరపైకి వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు కొత్త ఏడాదిలో కొత్త ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే 2014 మాదిరిగా మళ్లీ టీడీపీతో కలిస్తే పాత ప్రశ్నలు, విమర్శలు కూడా ఎదుర్కొంటారు. జోతిష్య నిపుణులు పాలెపు రాజేశ్వర శర్మ ఇప్పటికే మెగా ఫ్యామిలీ జ్యోతిష్యం చెప్పారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, నాగబాబుల పొలిటికల్‌ కెరీర్‌లో హైప్‌ అనేది ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌కు సీఎం అయ్యే చాన్స్‌ అయితే ఇప్పట్లో లేదన్నారు. అంతేకాదు.. పవన్‌ పార్టీని సంపూర్ణంగా వదిలేసి.. బీజేపీలోకి మెర్జ్‌ అవుతారని నేను అనుకుంటున్నా అంటూ సొంత నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. అదే జరిగితే జనసేనకు భవిష్యత్‌ లేనట్లే.

అన్నట్లు ఇప్పటివరకూ మరో పార్టీ ఊసే మరచిపోయాం. అందులోనూ అది ఆషామాషీ పార్టీ కాదు. జాతీయ పార్టీ కూడాను. బీజేపీ కాదండోయ్‌.. ఎందుకంటే ఏపీలో ఆ పార్టీ భవిష్యత్‌ ఎప్పుడూ ఇతర పార్టీలపైనే ఆధారపడి ఉంటుంది. మిగిలిన పార్టీ ఏంటంటే కాంగ్రెస్‌. వర్తమానమే లేని ఆ పార్టీ భవిష్యత్‌ గురించి ఏం చెప్పుకుంటాం. అందుకే దాని ఊసే లే.

శుభకృత్‌ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ..

– కల్యాణ్‌. ఎస్, సీనియర్‌ జర్నలిస్ట్‌.

Show comments