Idream media
Idream media
కోవిడ్ నూతన వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ తెలంగాణకు వచ్చేసింది. తొలిసారిగా హైదరాబాద్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ సోకిన ఇద్దరూ విదేశాల నుంచి వచ్చిన వారే. కెన్యా నుంచి వచ్చిన ఓ యువతికి, సొమాలియా నుంచి వచ్చిన మరో యువకుడికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్య శాఖ అధికారులు గుర్తించారు. వారిని హైదరాబాద్ గచ్చిబౌలీలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. వీరితోపాటు కెన్యా నుంచి హైదరాబాద్ మీదుగా కలకత్తాకు వెళ్లిన ఏడేళ్ల బాలుడికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం పశ్చిమ బెంగాల్ వైద్య శాఖ అధికారులకు చేరవేశారు.
లక్షణాలు లేవు..
విదేశాల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరికీ వైద్య శాఖ అధికారులు విమానాశ్రయాల్లోనే పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో కెన్యా, సొమాలియా నుంచి వచ్చి ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. అయితే వారిలో ఎలాంటి లక్షణాలు లేవని వైద్యశాఖ చెబుతోంది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో ఖచ్చితంగా తెలియదని పేర్కొంది. స్వల్ప లక్షణాలు, తక్కువ తీవ్రత ఉంటోందని తెలిపింది. తలనొప్పి, స్వల్ప జ్వరం, జలుబు, దగ్గు ఉంటాయని వైద్యశాఖ చెబుతోంది.
మాస్కే.. రక్ష..
ఇతర వేరియంట్ల కన్నా.. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేస్తున్నారు. మాస్క్, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతతో 90 శాతం వైరస్ బారిన పడకుండా ఉండగలమని అధికారులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని,మధ్యలో తీయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో నలుగురు ఉంటే.. మాస్క్ ధరించాలని, ఇంట్లోకి వెలుతురు వచ్చేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా, ఇంతకు ముందే కొవిడ్ సోకినా.. ఒమిక్రాన్ వచ్చే ప్రమాదం లేకపోలేదని వైద్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 77 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. కేవలం నెల రోజుల్లోనే ఈ స్థాయిలో వ్యాపించడంతో.. దాని వేగం ఎంతనేది అర్థమవుతోంది. ఈ వేరియంట్ వైరస్ సోకి బ్రిటన్‌లో ఒకరు మరణించారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ మరణాలు తక్కువగా ఉండడమే ఊరటనిచ్చే అంశం. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్.. తీవ్రత తక్కువగా ఉండడం ఆందోళనను తగ్గిస్తోంది. అయితే అప్రమత్తంగా లేకపోతే… వైరస్ బాధితుల సంఖ్య రోజుల వ్యవధిలోనే భారీగా పెరిగే ప్రమాదం ఉంది.
Also Read : ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్: వ్యాప్తిలో వేగము , తీవ్రతలో మందము