Oppressed Castes : కులవివక్ష సినిమాలు మనకు కొత్త కాదు

ఇటీవలే ప్రైమ్ లో విడుదలైన జైభీమ్ మీద ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. వెనుకబడిన వర్గాలకు కొన్ని వేల కేసులను ఉచితంగా వాదించిన జస్టిస్ చంద్రు కథ ఆధారంగా రూపొందిన ఈ సీరియస్ డ్రామా క్రిటిక్స్ మెప్పును సైతం పొందింది. అయితే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఇలాంటి సినిమాలు తెలుగులో తీయలేరా, మన స్టార్లు మారరా అని నిలదీస్తున్న వాళ్ళ సంఖ్య కూడా గట్టిగానే ఉంది. తమిళ మలయాళంలో మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయని వెటకారం చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ వాస్తవిక కోణంలో ఆలోచిస్తే గతాన్ని ఒకసారి తరచి చూస్తే కొన్ని వాస్తవాలు, కొత్త కోణాలు బయట పడతాయి.

మెగాస్టార్ గా తిరుగులేని మార్కెట్ ని సొంతం చేసుకున్న రోజుల్లోనే చిరంజీవి చేసిన రుద్రవీణ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పెద్ద కులాల ఆలోచనా ధోరణి ఎలా మారాలన్న అంశం మీద తీసిందే. బాలచందర్ అద్భుత కళాఖండం ఇది. గ్రామీణ సౌభాగ్యం గురించి కె విశ్వనాథ్ రూపొందించిన జననీ జన్మభూమిలో హీరో బాలకృష్ణ. అధికారం ముసుగులో పోలీసులు అరాచకాలను నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకొచ్చిన నాగార్జున జైత్రయాత్రను విస్మరించకూడదు. హాస్యబ్రహ్మ జంధ్యాల సత్యాగ్రహం సినిమా ద్వారా పెత్తందారీ వ్యవస్థను నేరుగా ప్రశ్నించారు. అర్చన నటించిన దాసిలో చాలా సున్నితమైన అంశాలను స్పృశించారు. ఇప్పటికీ అదో కల్ట్ క్లాసిక్

సరే ఇవన్నీ ఎప్పుడో పాతికేళ్ల క్రితం ఉదాహరణలు అనుకుందాం. మరి పలాస ఎప్పుడు వచ్చింది. అందులో దర్శకుడు కరుణ కుమార్ తీసుకున్న అంశం ఏంటి. దానికొచ్చిన పేరు వల్లే కదా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు దక్కించుకోగలిగారు. కోలీవుడ్ లో గత నాలుగేళ్లలో కుల వివక్ష మీద సినిమాలు వస్తున్నాయి కానీ మనవాళ్ళు ఎప్పుడో తీశారు. మాలపిల్లతో మొదలుపెడితే శ్రీదేవి సోడా సెంటర్ లాంటి కమర్షియల్ మూవీలోనూ ఎప్పటికప్పుడు టచ్ చేస్తూనే వచ్చారు. కాకపోతే పొరుగింటి పుల్లకూర రుచి తరహాలో ఎంతసేపూ మనదగ్గర రావడం లేదని నిందించడం కన్నా గతంలో తీసిన వాటి ఫలితాలు సమీక్షించుకుంటే కారణాలు అర్థమైపోతాయి

Also Read : Bheemla Nayak : ట్రయాంగిల్ వార్ లో ఏం జరగబోతోంది

Show comments