తిరుపతి పోతే టీడీపీ గోవిందేనా?

  • Published - 05:46 AM, Tue - 23 March 21
తిరుపతి పోతే టీడీపీ గోవిందేనా?

తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక తెలుగుదేశానికి దినదినగండంగా మారబోతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా చతికల పడిన ఆ పార్టీ రాబోయే ఉప ఎన్నికను ఎదుర్కోవడం, అక్కడ గణనీయమైన ఓట్ల శాతాన్ని రాబట్టడం ఇప్పుడు ఆ పార్టీకి డూ ఆర్ డై సమస్యగా మారింది. తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అంతంతమాత్రంగానే ఉన్న టిడిపి గౌరవప్రదమైన ఓట్లను అయినా రాబట్టి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.

తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ గెలుపు దాదాపు అసాధ్యమే. దీనిని ఆ పార్టీ నాయకులు సైతం అంతరంగిక సమావేశాల్లో బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పుడే కాదు.. గడిచిన మూడున్నర దశాబ్దాల్లో ఒక్కసారి కూడా తిరుపతి పార్లమెంట్ లో టీడీపీ గెలవలేదు. చివరిసారిగా 1984 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే తిరుపతిలో టీడీపీ గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ (టీడీపీ మద్దతుతో) గెలుస్తూ వచ్చాయి. తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో టిడిపి బలం నామమాత్రమే. కాకపోతే గత ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లయినా ఈ సారి వస్తాయా..? రావా..? అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇటు స్థానిక ఎన్నికల్లో ఫుల్ జోష్ మీద ఉన్న అధికార పార్టీను అడ్డుకోవడం టీడీపీకి పెద్ద సవాల్.

వైసిపి వ్యతిరేక ఓట్లు ఉన్నా అవి బిజెపి టిడిపి పంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొద్దో గొప్పో ఉన్న ఓట్లను సైతం టిడిపి ఏకపక్షంగా గెలుచుకోవడానికి లేదు. ముఖ్యంగా తిరుపతి లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల టిడిపి నాయకుల మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు నియోజకవర్గాల్లోని టిడిపి ఇన్చార్జ్ మీద ఆ పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య సఖ్యత లేదు.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో మొత్తం 14 లక్షల ఓట్లు ఉన్నాయి. 2019 లో వైసీపీకి 722877 ఓట్లు, టీడీపీకి 494501 ఓట్లు పడ్డాయి. 228376 ఓట్లు మెజారిటీతో వైసీపీ గెలిచింది. ఇప్పుడు వైసీపీకి పెద్దగా పోటీ లేదు. అందులోనూ బల్లి దుర్గాప్రసాద్ మరణం మీద ఉన్న సానుభూతి అధికార పార్టీకి సానుకూలం. అయితే టీడీపీ పాత ఓట్లు సాధించడానికి అయినా తాపత్రయపడుతోంది. అందులోనూ అధికార పార్టీ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రులు ఎమ్మెల్యేలతో కూడిన సమన్వయ కమిటీలు వేసి దూసుకుపోతుంటే, టీడీపీ మాత్రం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. ఇక టిడిపి అభ్యర్థిగా పనబాక లక్ష్మి అయిష్టత గానే రంగంలో ఉన్నట్లు ఆమె ప్రసంగాల ద్వారానే అర్థమవుతోంది.

ఇప్పటికే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా డీలా పడిన టిడిపి, ఆయన సొంత జిల్లా చిత్తూరు లోని కీలక తిరుపతి లోక్ సభ స్థానాన్ని గెలుచుకోవడం అనేది ఆ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన ది. అందులోనూ తిరోగమన దశలో ఉన్న టిడిపి కి మళ్లీ జీవం పోయాలంటే తిరుపతి ఉపఎన్నిక ఒకటే మార్గం. అయితే ఎలా ముందుకు వెళ్లాలి అన్న దాని మీద చంద్రబాబు కి ఒక దిశ కనిపించడం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయాలన్నది, ఏ అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ఎజెండాగా తీసుకోవాలి అనేది టిడిపికి స్పష్టత లేదు. ఒకవేళ అధికారపార్టీకి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వస్తే దానిని ఎలా కవర్ చేసుకోవాలి, ఎలాంటి ఆరోపణలు గుప్పించాలి అన్న విషయం మీదే టిడిపి నేతలు దృష్టి పెట్టారు తప్పితే, కనీసం ఎన్నికల్లో ఎలా పోరాడాలన్న దాని మీద ఇప్పటివరకు చర్చించిన దాఖలాలు లేవు. ఈ పరిణామాలే టిడిపి ఉనికిని, భవిష్యత్తును సైతం ప్రశ్నించేలా కనిపిస్తున్నాయి.

Also Read : టీడీపీ కంచుకోటలో అలజడి !

Show comments