Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో అప్రహతిహతంగా కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంపై కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. పంచాయతీ, మున్సిపాల్టీ, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నిక ఏదైనా ఆ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. విపక్షాలు ఎన్ని ఎత్తులు, జిత్తులు వేస్తున్నా పాచికలు పారడం లేదు. తలకిందులుగా తపస్సు చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. గెలుపు కాదు కదా.. కనీసం గెలుస్తామన్న ఆశ కూడా వారికి ఇవ్వడం లేదు. సంక్షేమ సారథి, సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాల ముందు, పని చేసుకుంటూ పోతే ప్రజలే మనల్ని గుర్తిస్తారన్న ఆయన నమ్మకం ముందు ఏదీ పని చేయడం లేదు. పరిస్థితి ఇలానే ఉంటే పరిషత్ ఎన్నికలే కాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయం టీడీపీలో కలగకమానదనడం అతిశయోక్తి కాదేమో..!
వైసీపీ హ్యాట్రిక్
ఏ ఎన్నిక చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. సాధారణ ఎన్నికలు మొదలుపెట్టుకుని మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్ గిర్రున తిరుగుతోంది. వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని శక్తిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనను మెచ్చి ఇప్పుడు అనివార్యంగా వచ్చిన తిరుపతి లోక్‌సభ ఎన్నికలోనూ ఓటర్లు వైఎస్సార్‌సీపీకి తిరిగి ఎంపీ స్థానం కట్టబెట్టారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ ఇప్పుడు ఉప ఎన్నికలోనూ సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించింది.
జగన్ ప్రచారానికి రాకపోయినా…
డాక్టర్ గురుమూర్తి తిరుపతి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందడం విశేషం. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ స్థానాలన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉండడం విశేషం. వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రచారానికి రాకపోయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీ అభ్యర్థి గురుమూర్తి తిరుగులేని ఆధిక్యంతో దూసుకు వచ్చారు. రౌండ్‌రౌండ్‌కు ఆధిక్యం పెంచుకుంటూ చివరకు విజయబావుటా ఎగురవేశారు.
రెండేళ్లకే ఇంత ఆదరణ పొందితే…
జగన్ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ కాలంలోనే జగన్ సంక్షేమానికి ప్రజలు ఎంతాల ముగ్గులవుతున్నారో అనడానికి వరుస ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయాలే నిదర్శనం. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రానున్న మూడేళ్లలో జగన్ విస్తరించబోయే సంక్షేమ పాలనకు ఇక ఏపీలో వైసీపీ అనే పేరు తప్పా.. మరో రాజకీయ పార్టీని ప్రజలు గుర్తించరన్న పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గెలుపే కాదు.. ప్రతీ ఎన్నికలోనూ అంతకు మించిన ఫలితాలే వైసీపీకి వస్తున్నాయి. ప్రతి ఎన్నికలోనూ స్వీన్ సీప్ చేసుకుంటూ పోతోంది. ఆవేశ పూరిత మాటల్లేవ్.. ప్రతిపక్షాలపై ఆరోపణలు అసలే లేవు.. సభలు, ప్రసంగాలు లేవు.. జగన్ కేవలం ఒకే ఒక్క లేఖ రాస్తే చాలు ప్రజలు జై కొడతారనడానికి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నిదర్శనంగా నిలిచింది.